ఇజ్రాయెల్ సైన్యం క్రూరత్వం..! 18 నెలల పసికందును సిగరెట్లతో కాల్చి, మేకులతో కొట్టి చిత్రహింసలు.. తండ్రిని వివస్త్రను చేసి ఘాతుకం: భయానక వీడియో

మధ్య గాజాలోని అల్-మఘాజీ శరణార్థి శిబిరం సమీపంలో, కేవలం 18 నెలల వయసున్న పాలస్తీనా పసికందును ఇజ్రాయెల్ సైనికులు బందీగా పట్టుకుని, సిగరెట్లతో కాల్చడమే కాకుండా మేకులతో కొట్టి చిత్రహింసలకు గురిచేశారనే దిగ్భ్రాంతికరమైన వార్త వెలుగులోకి వచ్చింది.

తండ్రి కళ్లముందే పసికందుపై జరిగిన ఈ అమానుషం అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది.

అసలేం జరిగింది?
గత మార్చి 21న, ఒసామా అబు నాజర్ తన ఏడాదిన్నర కుమారుడు కరీమ్ అబు నాసర్ తో కలిసి వెళ్తుండగా, ఇజ్రాయెల్ రక్షణ దళాలు (IDF) వారిపై కాల్పులు జరిపాయి. అనంతరం తండ్రిని వివస్త్రను చేసి తనిఖీ చేసిన సైనికులు, అతని నుండి వాంగ్మూలం తీసుకోవడం కోసం చిన్నారిని చిత్రహింసలకు గురిచేశారు.
దీనిపై చిన్నారి తల్లి ఆవేదన వ్యక్తం చేస్తూ.. “బిడ్డ శరీరంపై సిగరెట్లతో కాల్చిన గాయాలు ఉన్నాయి. అంతేకాకుండా, ఇజ్రాయెల్ సైనికులు నా కొడుకు కాలిలోకి మేకును దింపి హింసించారు” అని కన్నీరుమున్నీరయ్యారు. 10 గంటల నిర్బంధం తర్వాత, రెడ్‌క్రాస్ సహాయంతో చిన్నారిని బంధువులకు అప్పగించారు. కానీ, తండ్రి ఇంకా ఇజ్రాయెల్ సైన్యం అదుపులోనే ఉన్నాడు.

అంతర్జాతీయ స్పందన
ఈ ఘటనను ఐరాస (UN) పాలస్తీనా ప్రాంతాల ప్రత్యేక ప్రతినిధి ఫ్రాన్సిస్కా అల్బనీస్ తీవ్రంగా ఖండించారు. “తండ్రిని లొంగదీసుకోవడానికి పసికందును చిత్రహింసలకు గురిచేసేంతటి నీచమైన నేరగాళ్లలా వీరు ప్రవర్తిస్తున్నారు!” అని ఆమె ఎక్స్‌ (X) వేదికగా మండిపడ్డారు. ఇజ్రాయెల్ జైళ్లలో పాలస్తీనియన్లు క్రమపద్ధతిలో శారీరక, మానసిక హింసకు గురవుతున్నారని ఆమె తన నివేదికలో పేర్కొన్నారు.

ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాకర్ కలిబాఫ్ స్పందిస్తూ.. “ప్రపంచం గాజాతో అన్నా నిలబడాలి లేదా పసిపిల్లలను హింసించే ఉగ్రవాద పాలనకు మద్దతుగా అన్నా ఉండాలి. ఇందులో తటస్థతకు తావులేదు” అని అన్నారు. ఐరాస నివేదిక ప్రకారం, అక్టోబర్ 2023 నుండి ఇప్పటివరకు సుమారు 18,500 మంది పాలస్తీనియన్లను అరెస్టు చేశారు. ఇందులో 1,500 మందికి పైగా పిల్లలు ఉన్నారు. జైళ్లలో సరైన ఆహారం ఇవ్వకుండా ఆకలితో అలమటించేలా చేయడం, లైంగిక వేధింపులు మరియు దారుణమైన దాడులు నిత్యకృత్యంగా మారాయని ఆ నివేదిక ఆరోపించింది.


Posted

in

by

Tags: