కార్లో స్టంట్లు చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా నియంత్రణ కోల్పోయిన వాహనం విద్యార్థులపైకి దూసుకెళ్లిన ఘటన తీవ్ర కలకలం రేపింది.
ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గ్రేటర్ నోయిడాలో జరిగింది. కొందరు కార్లలో స్టంట్లు చేస్తుండగా, ఒక ఆల్టో కార్ నియంత్రణ కోల్పోయి అక్కడ నిలబడి ఉన్న విద్యార్థులపైకి దూసుకెళ్లినట్లు సమాచారం.
ఈ ప్రమాదంలో 4 నుండి 5 మంది విద్యార్థులు గాయపడ్డారు. వారిలో గౌరవ్ నగర్ అనే విద్యార్థి కాలు విరిగింది. అతను ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం ఇంటికి చేరుకున్నట్లు తెలుస్తోంది. మిగతా విద్యార్థులకు కూడా గాయాలయ్యాయి.
ప్రమాదానికి ముందు కొందరు కార్లతో స్టంట్లు చేస్తున్న దృశ్యాలు వీడియో రూపంలో బయటకు వచ్చాయి. కార్‌ను గుండ్రంగా తిప్పుతూ డ్రిఫ్ట్ చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా నియంత్రణ కోల్పోయి విద్యార్థులను ఢీకొట్టిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఢీకొట్టిన తర్వాత ఆ కార్ అక్కడ నుండి వెళ్లిపోయినట్లు వెల్లడించారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ప్రమాదానికి కారణమైన కార్‌తో పాటు డ్రైవర్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో, పోలీసులు విచారణను వేగవంతం చేశారు.

Leave a Reply