అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలో ఉన్న ఓ భారతీయ కిరాణా దుకాణంలో, తమలపాకుల మధ్యలో గుట్టుచప్పుడు కాకుండా పాన్ మసాలా ప్యాకెట్లు పెట్టి విక్రయిస్తున్న వింత వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది.
న్యూజెర్సీలో నివసిస్తున్న ఓ భారతీయ యువకుడు ఈ ఆసక్తికరమైన దృశ్యాన్ని చిత్రీకరించి ‘mohsin.siddiqui96’ అనే ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు.
ఆ వీడియోలో.. దుకాణానికి వచ్చిన ఓ కస్టమర్ గుసగుసలాడుతూ పాన్ మసాలా ప్యాకెట్ అడగడం, వెంటనే వ్యాపారి ఎవరికీ అనుమానం రాకుండా తమలపాకుల కట్ట మధ్యలో ఆ ప్యాకెట్‌ను దాచి అత్యంత రహస్యంగా అతనికి అందించే సరదా దృశ్యం రికార్డైంది.
అమెరికాలో గుట్కా, నమిలే పొగాకు ఉత్పత్తుల అమ్మకాలపై కఠిన ఆంక్షలు, నిషేధాలు ఉన్న కారణంగా.. అక్కడి కొన్ని భారతీయ దుకాణాల్లో వీటిని ఇలా నిషేధిత మత్తుపదార్థాల తరహాలో రహస్యంగా విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. (మహారాష్ట్రలో గుట్కా మాఫియాపై ఉక్కుపాదం మోపిన ఐఏఎస్ అధికారి తుకారాం ముండేను ఉద్దేశించి నెటిజన్లు సరదాగా కామెంట్లు పెడుతున్నారు).
ఖండాలు దాటి అమెరికా వెళ్లినా భారతీయుల ఈ అలవాట్లు ఇంకా రహస్యంగా కొనసాగుతుండటం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతూ, ఈ వీడియోపై రకరకాల ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.

Leave a Reply