తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఈరోజు అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ నివాసానికి వెళ్లారు.
ఆ సమయంలో ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ ముఖ్యమంత్రి విజయ్ను ఆత్మీయంగా హత్తుకుని స్వాగతం పలికారు. అనంతరం స్టాలిన్ కూడా విజయ్ను ఆలింగనం చేసుకుని, సాదరంగా లోపలికి ఆహ్వానించారు. ఆ తర్వాత ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి వైకోను ఆయన నివాసంలోనే ముఖ్యమంత్రి విజయ్ కలిశారు.
దురై వైకో మరియు వైకో కుటుంబ సభ్యులు విజయ్‌కు ఘనస్వాగతం పలికారు. అయితే, అక్కడ హైలైట్ ఏమిటంటే.. వైకో తన ఇంట్లో పనిచేసే సిబ్బంది అందరినీ ముఖ్యమంత్రి విజయ్‌కు పరిచయం చేసి, వారితో ఫోటోలు దిగేలా చేయడం. “తమిళనాడులో అన్నాదురై తర్వాత, ఇలా సీనియర్ రాజకీయ నేతల ఇళ్లకు స్వయంగా వెళ్లి ఆశీస్సులు తీసుకున్న ముఖ్యమంత్రి విజయ్ మాత్రమే” అని వైకో ఉద్వేగంతో పేర్కొన్నారు. అదేవిధంగా మాజీ సీఎం స్టాలిన్ మాట్లాడుతూ.. “నేను నా ప్రేమపూర్వకమైన సలహాలు, సూచనలను విజయ్‌కు అందించాను” అని తెలిపారు. మరోవైపు తిరుమావళవన్ స్పందిస్తూ.. “విజయ్ రాజకీయాల్లో ఇంతటి హుందాతనంతో వ్యవహరించడం సంతోషంగా ఉంది” అని కొనియాడారు.
ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి విజయ్ పీఎంకే (PMK) అధినేత అన్బుమణి రామదాస్ నివాసానికి వెళ్లారు. చెన్నైలోని అక్కరైలో ఉన్న అన్బుమణి ఇంటికి వెళ్లిన విజయ్, ఆయన నుండి శుభాకాంక్షలు అందుకున్నారు. ఆ సమయంలో ఎమ్మెల్యే సౌమ్య అన్బుమణి కూడా అక్కడే ఉన్నారు. ముఖ్యమంత్రి వస్తున్నారని తెలిసి అన్బుమణి తన కుటుంబంతో సహా ఇంటి వాకిలి వరకు వచ్చి విజయ్‌కు స్వాగతం పలకడం గమనార్హం.
దీనిని అనుసరిస్తూ.. ముఖ్యమంత్రి విజయ్ ప్రస్తుతం సీమన్ నివాసానికి చేరుకున్నారు. విజయ్ కోసం సీమన్ అప్పటికే ఇంటి వాకిట వేచి ఉండగా, ముఖ్యమంత్రి రాగానే ఆయనను ఎంతో ప్రేమగా లోపలికి తీసుకెళ్లారు. తమిళ రాజకీయ చరిత్రలో మొదటిసారిగా ఒక ముఖ్యమంత్రి అన్ని రాజకీయ పార్టీల నేతల ఇళ్లకు స్వయంగా వెళ్లడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తికరంగా, సంచలనంగా మారింది.
