కేరళ రాష్ట్రం పాలక్కాడ్ జిల్లా మన్నంపట్ట ప్రాంతంలో అరుదైన విచిత్ర కొబ్బరికాయ ఒకటి లభ్యమైంది.
అక్కడి రిటైర్డ్ ఆర్మీ అధికారి జయరామ్ ఇంటి పెరట్లోని చెట్ల నుంచి కోసిన కొబ్బరికాయలను కూలీలు ఒలుస్తుండగా.. ఒక కాయ మాత్రం సాధారణానికి భిన్నమైన ఆకారంలో ఉండటం కనిపించింది.
సాధారణంగా కొబ్బరికాయపై మూడు “కళ్లు” ఉంటాయి. కానీ ఈ కొబ్బరికాయపై స్పష్టంగా నాలుగు కళ్లు ఉన్నాయి. ఇది స్థానికుల దృష్టిని ఆకర్షించగా.. ఆ కాయను పగలగొట్టి చూడగా లోపల మరో ఆశ్చర్యకరమైన దృశ్యం ఎదురైంది.
ఆ కొబ్బరికాయ లోపల పూర్తి ఎదుగుదలతో ఉన్న మరో రెండు చిన్న బుల్లి కొబ్బరికాయలు దర్శనమిచ్చాయి. సాధారణ కాయలకంటే పూర్తి భిన్నంగా ఉన్న ఈ ఆకృతి స్థానిక ప్రజలను అమితాశ్చర్యానికి గురిచేసింది. ఇలాంటి జంట కొబ్బరికాయల నిర్మాణాలు ప్రకృతిలో అత్యంత అరుదుగా కనిపించే దృగ్విషయంగా భావిస్తారు.
ఈ వింత కొబ్బరికాయ గురించిన సమాచారం దావానలంలా వ్యాపించడంతో మన్నంపట్టతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు జయరామ్ ఇంటికి తరలివచ్చి దాన్ని ఆసక్తిగా తిలకించారు. ప్రస్తుతం ఈ కొబ్బరికాయకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
