సాధారణంగా కొండచిలువలు నెమ్మదిగా పాకుతున్నట్లు కనిపించినా, వేటను పట్టుకునేటప్పుడు మాత్రం మెరుపు వేగంతో దాడి చేస్తాయి. అయితే, తనపైకి దూసుకొచ్చిన ఒక భారీ కొండచిలువ మెడను, మద్యం మత్తులో ఉన్నట్లుగా కనిపిస్తున్న ఒక వ్యక్తి రెప్పపాటు కాలంలో చేతులతో పట్టేసుకున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇన్స్టాగ్రామ్ పేజీ (@therealtarzann) లో షేర్ చేయబడిన ఈ వీడియోలో, దట్టమైన అడవి ప్రాంతంలో ఒక వ్యక్తి భారీ కొండచిలువ ముందు నిలబడి ఉన్నాడు. అతను మద్యం మత్తులో ఉన్నాడని సమాచారం. ఆ కొండచిలువ ఒక్కసారిగా తన తలను చాచి సెకనుకు 3.3 మీటర్ల వేగంతో ఆ వ్యక్తిపై దాడికి ప్రయత్నించింది.
సాధారణ వ్యక్తి అయితే ఆ దెబ్బకు తలతిరిగిపోయేది. కానీ, ఆ వ్యక్తి కనురెప్ప వేగంతో, గాలిలో దూసుకొస్తున్న పాము మెడను చాకచక్యంగా పట్టుకుని ‘లాక్’ చేశాడు. పాములను పట్టడంలో శిక్షణ పొందిన నిపుణుల కంటే కూడా అతని వేగం ఎక్కువగా ఉండటం చూసేవారిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ఈ వీడియో చూసిన నెటిజన్లు, “ఈరోజు ఆ పాము తప్పుడు వ్యక్తితో పెట్టుకుంది” అంటూ సరదాగా కామెంట్ చేస్తున్నారు. “మత్తులో ఉన్నా అతని రిఫ్లెక్స్ (ప్రతిచర్య) వేగం అద్భుతం” అని మరికొందరు ప్రశంసిస్తున్నారు. “వెల్కమ్ టు ఆఫ్రికా” అనే క్యాప్షన్‌తో ఉన్న ఈ వీడియో సోషల్ మీడియాలో మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధిస్తోంది.
