వారణాసి: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వారణాసిలోని గంగా తీరంలో ఎవరూ నమ్మలేని ఒక వింత ఘటన చోటుచేసుకుంది.
వికాస్ అనే 21 ఏళ్ల యువకుడు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చేరగా, అతడిని పరీక్షించిన వైద్యులు వికాస్ చనిపోయాడని ప్రకటించారు. దీంతో తీవ్ర దుఃఖంలో మునిగిపోయిన బంధువులు, అంత్యక్రియల కోసం అతడి దేహాన్ని మోసుకుంటూ గంగా నది తీరానికి తీసుకెళ్లారు.
అయితే, అంత్యక్రియల ఆచారంలో భాగంగా మృతదేహాన్ని గంగా నది నీటిలో ముంచేందుకు ప్రయత్నిస్తుండగా, ఒక్కసారిగా ఆ యువకుడి కాళ్లు, చేతులు కదలడం మొదలైంది. అతడు మళ్లీ శ్వాస తీసుకోవడం ప్రారంభించాడు.
భయంతో పరుగులు తీసిన జనం
చనిపోయాడనుకున్న యువకుడు అకస్మాత్తుగా కదలడం చూసి అక్కడున్న బంధువులు, ప్రజలు భయంతో కేకలు వేస్తూ చెల్లాచెదురుగా పరుగు తీశారు. ఆ తర్వాత తేరుకున్న కుటుంబ సభ్యులు, వెంటనే అతడిని తిరిగి ఆసుపత్రికి తరలించారు. కానీ దురదృష్టవశాత్తూ, చికిత్స ప్రారంభించిన కొద్దిసేపటికే వికాస్ మళ్లీ మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.
ఆసుపత్రి నిర్లక్ష్యమే కారణమా?
వైద్యుల నిర్లక్ష్యం వల్లే తన కొడుకు ప్రాణాలు పోయాయని వికాస్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అంతుచిక్కని ఈ ఉదంతం కాశీ అంతటా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
