“ఇది వివాహం కాదు, విలాసవంతమైన వ్యాజ్యం”. నేనే దివంగత సూపర్ స్టార్ భార్యను. సుప్రీంకోర్టు గడప తొక్కిన ప్రముఖ నటికి న్యాయస్థానం మొట్టికాయలు. లివ్-ఇన్ రిలేషన్‌షిప్ కేసులో సంచలన తీర్పు.!!!

దివంగత మాజీ సూపర్ స్టార్ రాజేష్ ఖన్నాతో ముడిపడి ఉన్న కేసులో గురువారం సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది.

రాజేష్ ఖన్నా, తాను భార్యాభర్తలుగా జీవించామని, ఆ బంధాన్ని చట్టబద్ధంగా ‘వివాహం’గా గుర్తించాలని కోరుతూ మాజీ నటి, రచయిత్రి అనితా అద్వానీ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. అంతేకాకుండా, ఈ కేసును ఒక “విలాసవంతమైన వ్యాజ్యం (Luxury Litigation)”గా అభివర్ణించిన ధర్మాసనం, ఈ పిటిషన్‌ను విచారించడానికి ఎలాంటి ప్రాతిపదిక లేదని స్పష్టం చేసింది.

2012లో రాజేష్ ఖన్నా మరణించే వరకు ఆయనతో కలిసున్న అనితా అద్వానీ, తమ బంధానికి ‘గౌరవం’ దక్కాలని కోరుతూ ఈ కేసు వేశారు. బాంబే హైకోర్టు గత ఏప్రిల్ నెలలో ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఆమె సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎం.ఎం. సుందరేశ్, జస్టిస్ ప్రసన్న బి. వరాలె లతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించి కొట్టివేసింది. దీంతో అనితా అద్వానీ సుదీర్ఘకాలంగా సాగిస్తున్న న్యాయపోరాటానికి తెరపడింది.

రాజేష్ ఖన్నాకు చెందిన ప్రసిద్ధ ‘ఆశీర్వాద్’ బంగ్లాలో ఆయనతో కలిసి ఏళ్ల తరబడి తాను ‘లివ్-ఇన్’ రిలేషన్‌షిప్‌లో ఉన్నానని అనితా అద్వానీ వాదిస్తూ వచ్చారు. రాజేష్ ఖన్నా మరణానంతరం ఆయన భార్య డింపుల్ కపాడియా, కుమార్తె ట్వింకిల్ ఖన్నా, అల్లుడు అక్షయ్ కుమార్ తనను ఆ బంగ్లా నుంచి గెంటేశారని ఆమె ఆరోపించారు. ఆ తర్వాత 2013లో గృహహింస చట్టం కింద డింపుల్ కపాడియా కుటుంబంపై ఆమె ఫిర్యాదు చేసి, నెలవారీ మనోవర్తితో (భరణం) పాటు బాంద్రాలో ఒక ఫ్లాట్ ఇవ్వాలని డిమాండ్ చేయడం గమనార్హం.

అనితా అద్వానీ డిమాండ్‌ను తిరస్కరించిన హైకోర్టు, రాజేష్ ఖన్నాతో ఆమెకు ఉన్న సంబంధాన్ని వివాహ బంధంగా పరిగణించలేమని, కాబట్టి గృహహింస చట్టం కింద ఆమె ఎలాంటి పరిహారం కోరలేరని తీర్పునిచ్చింది. 1978లో విడుదలైన ‘షాలిమార్’ చిత్రంలో చిన్న పాత్రతో తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన అనితా అద్వానీ, కొన్నేళ్ల క్రితం హిందీ బిగ్‌బాస్ షోలో కూడా పాల్గొనడం విశేషం.


Posted

in

by

Tags: