ఇది స్కూలా లేక జైలా..? ఖైదీలకు కూడా ఇంతకంటే స్వేచ్ఛ ఉంటుంది.. కానీ చదువుకునే పిల్లలకు అది కూడా లేదు.. 6 నెలలకు ఒక్కసారే మూత్రవిసర్జన చేయాలా? పాఠశాలలో అత్యంత దారుణమైన నిబంధనలు!

తరగతులు జరుగుతున్నప్పుడు హఠాత్తుగా కాలకృత్యాలు తీర్చుకోవాల్సి వస్తే ఎవరైనా ఏం చేస్తారు? వెంటనే వాష్‌రూమ్‌కు వెళ్లడం ప్రాథమిక మానవ సహజ లక్షణం.

కానీ చైనాలోని ఓ పాఠశాలలో అత్యంత ప్రాథమికమైన ఈ మానవ అవసరానికే కఠిన ఆంక్షలు విధించి అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశారు.

దక్షిణ చైనాలోని గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌కు చెందిన రుయువాన్ కౌంటీ హైస్కూల్ ఈ విచిత్రమైన ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాల ప్రకారం.. పూర్తి ఆరు నెలల పాటు సాగే ఒక సెమిస్టర్ కాలంలో, క్లాస్ జరుగుతున్న సమయంలో విద్యార్థులు కేవలం ఒకే ఒక్కసారి మాత్రమే వాష్‌రూమ్‌కు వెళ్లడానికి అనుమతి ఉంటుందనే షాకింగ్ సమాచారం వెలుగులోకి వచ్చింది. ‘సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్’ వెల్లడించిన ఈ కథనం సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపించి తీవ్ర దుమారాన్ని రేపింది.

ఈ ఆదేశాలు ఎలా బయటకు వచ్చాయో తెలుసా? ఆ పాఠశాలకు చెందిన ఓ ఉపాధ్యాయుడు, స్టాఫ్ మీటింగ్‌లో ప్రదర్శించిన పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ (PPT) స్లైడ్ ఫోటోను నెట్టింట లీక్ చేశారు. క్లాస్‌రూమ్ నిర్వహణ పేరిట విధించిన ఆ కఠిన నిబంధనలు ప్రజలను విస్మయానికి గురిచేశాయి. పూర్తి సెమిస్టర్‌లో ఒకే ఒక్కసారి మాత్రమే, అది కూడా అత్యంత అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే అనుమతిస్తారు.

ఒకసారికి మించి మళ్లీ వాష్‌రూమ్‌కు వెళ్తే, వెంటనే సదరు విద్యార్థి తల్లిదండ్రులను పాఠశాలకు పిలిపించి “క్రమశిక్షణ” పేరిట కౌన్సెలింగ్ ఇస్తారు; విద్యార్థిపై నేరుగా క్రమశిక్షణా చర్యలు తీసుకుంటారు. దీనికి పరాకాష్టగా.. ఈ నిబంధనల భారాన్ని ఉపాధ్యాయులపై కూడా రుద్దారు. విద్యార్థులు ఈ నిబంధనలను ఎంత పక్కాగా పాటిస్తున్నారనే అంశాన్ని ప్రాతిపదికగా తీసుకునే టీచర్ల పదోన్నతులు, వార్షిక ఇంక్రిమెంట్లు, అవార్డులను నిర్ణయిస్తామని ఆ స్లైడ్‌లో స్పష్టంగా పేర్కొన్నారు.

ఈ వార్త వైరల్ కావడంతో, చైనా సోషల్ మీడియా వేదికల్లో నెటిజన్లు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. “ఇది పాఠశాలా లేక కారాగారమా? ఖైదీలకు కూడా ఇంతకంటే ఎక్కువ స్వేచ్ఛ ఉంటుంది” అంటూ ఓ నెటిజన్ నిప్పులు చెరిగారు. తక్షణమే ఈ క్రూరమైన నిబంధనను రద్దు చేయాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్లు వెల్లువెత్తాయి.

వివాదం ముదరడంతో.. తొలుత ఇది “కేవలం అపార్థం మాత్రమే” అని కప్పిపుచ్చే ప్రయత్నం చేసిన యాజమాన్యం, తీవ్ర వ్యతిరేకత రావడంతో “గిట్టనివారు వ్యాప్తి చేసిన పుకారు” అంటూ మాట మార్చింది. అయినప్పటికీ, తల్లిదండ్రుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో.. స్థానిక విద్యాశాఖ రంగంలోకి దిగి ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ ప్రారంభించింది.


Posted

in

by

Tags: