హోటళ్లలో బస చేసినప్పుడు బట్టలు ఉతకడానికి, ఇస్త్రీ చేయించుకోవడానికి లాండ్రీ సేవలను వినియోగించడం సాధారణమే. అయితే, అందుకు కొంతమేర అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. కానీ పాకిస్థాన్‌లోని ఓ హోటల్‌లో విదేశీ పర్యాటకుడికి ఎదురైన అనుభవం మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
వివరాల్లోకి వెళ్తే.. పాకిస్థాన్‌లోని ఓ హోటల్‌లో బస చేస్తున్న విదేశీ పర్యాటకుడు తనకు చెందిన కేవలం ఐదు బట్టలను ఉతికి, ఇస్త్రీ చేయించేందుకు హోటల్ సిబ్బందికి ఇచ్చాడు. సాధారణంగా ఇలాంటి సేవలకు రూ.500 నుంచి రూ.1,000 వరకు ఖర్చవుతుందని భావించాడు.
కానీ కొద్దిసేపటి తర్వాత బట్టలతో పాటు బిల్లు తీసుకొచ్చిన హోటల్ సిబ్బంది చెప్పిన మొత్తం చూసి అతడు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. ఐదు బట్టలు ఉతికి, ఇస్త్రీ చేసినందుకు ఏకంగా 12 వేల పాకిస్థానీ రూపాయలకు పైగా (సుమారు 40 అమెరికన్ డాలర్లు) వసూలు చేశారు.
కేవలం ఐదు బట్టలకే ఇంత భారీ మొత్తం ఎలా వచ్చిందని ఆ పర్యాటకుడు ప్రశ్నించాడు. అయితే, హోటల్ సిబ్బంది మాత్రం ఏమాత్రం ఆశ్చర్యపోకుండా.. తమ హోటల్‌లో లాండ్రీ సేవలకు ఇదే సాధారణ ఛార్జీ అని సమాధానమిచ్చారు.
అంతేకాదు, ఇది ప్రీమియం సేవ కాదని, ఒకవేళ అత్యున్నత స్థాయి సేవలు తీసుకుంటే ఇంతకంటే ఎన్నో రెట్లు ఎక్కువ చెల్లించాల్సి వచ్చేదని వివరించినట్లు సమాచారం. సిబ్బంది సమాధానంతో విస్తుపోయిన ఆ విదేశీ పర్యాటకుడు అక్కడ మరింత వాదనకు దిగకుండా పూర్తి మొత్తాన్ని చెల్లించాడు. అయితే, ఈ ఛార్జీలపై తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. విదేశీ పర్యాటకుడని తెలిసే అతడి నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేశారా? అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. మరికొందరు హోటల్ ఛార్జీలను తీవ్రంగా విమర్శిస్తున్నారు.
అయితే, ఆ హోటల్ పేరు, అధికారిక లాండ్రీ ధరల వివరాలు బయటకు రాలేదు. కాబట్టి ఇది ఉద్దేశపూర్వకంగా అధికంగా వసూలు చేసిన ఘటననా? లేక ఆ హోటల్‌లో సాధారణంగా ఉండే ధరలేనా? అనేది ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది.

Leave a Reply