ఇద్దరు కుమార్తెలను రాత్రంతా తలకిందులుగా వేలాడదీసిన తండ్రి, ఒకరు మృతి; పక్కంటి వాడు ఏం చెప్పాడని ఆ తండ్రి ఇంత కిరాతకుడయ్యాడు?

మహారాష్ట్ర : సాంగ్లీ జిల్లాలోని ఆట్పాడి తాలూకాలో ఒక తండ్రి తన క్రూరత్వంతో కన్నకూతురి ప్రాణం తీసిన ఘటన వెలుగులోకి వచ్చింది. పొరుగున నివసించే వ్యక్తి తన కుమార్తెలు దొంగతనం చేశారని ఆరోపించడంతో ఆగ్రహించిన తండ్రి, తన ఇద్దరు బిడ్డలను రాత్రంతా ఇంటి పైకప్పుకు తలకిందులుగా వేలాడదీసిన దిగ్భ్రాంతికరమైన ఘటన సాంగ్లీలో జరిగింది.

ఈ అమానుష ఘటనలో రాత్రంతా తలకిందులుగా వేలాడదీయడం వల్ల నరకయాతన అనుభవించిన ‘సారిక యమగర్’ అనే పాఠశాల విద్యార్థిని మరణించగా, మరో కుమార్తె ‘అనుజ యమగర్’ ప్రస్తుతం ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

అసలు ఏం జరిగింది?

అందిన సమాచారం ప్రకారం, యమగర్ కుటుంబం ఆట్పాడిలోని బన్‌పురిలో నివసిస్తోంది. సారిక, అనుజ అనే ఇద్దరు బాలికలపై పొరుగున ఉండే ఒక వ్యక్తి దొంగతనం నెపం వేశాడు. దీంతో కోపంతో ఊగిపోయిన తండ్రి ‘దాదూ హైబత్ యమగర్’ ఇద్దరు కుమార్తెలను అమానుషంగా కొట్టాడు. అంతటితో ఆగకుండా, ఇంటి పైకప్పుకు ఉన్న ఇనుప యాంగిల్‌కు వారిద్దరినీ రాత్రంతా తలకిందులుగా వేలాడదీశాడు.

ఆ ఇద్దరు బాలికలు దాహంతో మంచినీళ్లు అడిగినా తండ్రి కనీసం నీళ్లు కూడా ఇవ్వలేదు. రాత్రంతా బాధతో విలవిలలాడిన సారిక ఉదయానికి శవమై కనిపించగా, అనుజ అపస్మారక స్థితిలో పడి ఉంది. దీంతో అనుజను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అత్యంత దారుణమైన విషయం ఏమిటంటే, సారిక మరణించినట్లు తెలియగానే యమగర్ కుటుంబం గుట్టుచప్పుడు కాకుండా ఆమెకు అంత్యక్రియలు నిర్వహించడానికి ప్రయత్నించింది. అయితే, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అనుజకు స్పృహ రావడంతో ఆమె జరిగిన విషయాన్ని ఆసుపత్రి యాజమాన్యానికి వివరించింది.

వెంటనే ఆసుపత్రి వర్గాలు ఆట్పాడి పోలీసులకు సమాచారం అందించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. కేవలం దొంగతనం చేశారనే అనుమానంతో కన్నతండ్రే తలకిందులుగా వేలాడదీసి, చితకబాదడంతో సారిక మరణించడం ఆ ప్రాంతంలో కలకలం సృష్టించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దాదూ యమగర్‌ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Posted

in

by

Tags: