ఈరోడ్ జిల్లా, చిత్తోడ్ సమీపంలోని అమరావతి నగర్‌కు చెందిన 29 ఏళ్ల మణికందన్ అనే ప్రైవేట్ బస్సు డ్రైవర్‌కు ఇప్పటికే రెండు పెళ్లిళ్లు అయ్యాయి.
మొదటి భార్య తస్మిన్ (26)తో ఆరేళ్లుగా కాపురం ఉంటున్న అతనికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇదిలా ఉండగా, కేరళకు చెందిన మలర్ (25) అనే మరో యువతిని ప్రేమించి రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమెతో కలిసి కాళింగరాయన్పాళయం ప్రాంతంలో విడిగా నివసిస్తున్నాడు. ఇలా ఇద్దరు భార్యలతో మార్చి మార్చి కాపురం చేస్తూ, భవానీ – ఈరోడ్ రూట్లో నడిచే ‘RKM’ ప్రైవేట్ బస్సులో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.
ఈ బస్సులో రోజూ ప్రయాణించే ఈరోడ్‌లోని ఓ ప్రైవేట్ కళాశాల విద్యార్థిని కావ్య (19)తో మణికందన్‌కు పరిచయం ఏర్పడింది. అతనికి అప్పటికే ఇద్దరు భార్యలు ఉన్నారని తెలిసినప్పటికీ, ఆ విద్యార్థిని అతనితో ప్రేమలో పడింది. కొన్ని రోజుల క్రితం కాలేజీకి వెళ్లిన కావ్య ఇంటికి తిరిగి రాకపోవడంతో, ఆందోళన చెందిన తల్లిదండ్రులు భవానీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి, ఆ విద్యార్థినితో కలిసి వెళ్లిన మణికందన్‌ను అదుపులోకి తీసుకొని విచారణ నిమిత్తం స్టేషన్‌కు తరలించారు.
మణికందన్, విద్యార్థినిని పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చిన విషయం తెలుసుకున్న అతని మొదటి భార్య, రెండో భార్య తమ కుటుంబసభ్యులతో కలిసి భవానీ పోలీస్ స్టేషన్ ఎదుట గుమిగూడారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత, గందరగోళం నెలకొంది. పోలీసులు వారిని శాంతింపజేసి మణికందన్, విద్యార్థిని కావ్యతో పాటు ఇద్దరు భార్యలను కూడా విచారిస్తున్నారు. అసలు ఆ విద్యార్థినిని తీసుకెళ్లడం వెనుక ఉన్న పూర్తి వివరాలపై ఆరా తీస్తున్నారు.
గతంలో అంబులెన్స్ డ్రైవర్, పొక్లెయిన్ ఆపరేటర్, ప్రభుత్వ బస్సు తాత్కాలిక డ్రైవర్‌గా పనిచేసిన మణికందన్.. బైక్‌లపై స్టంట్లు చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ‘రీల్స్’ పోస్ట్ చేసే అలవాటు ఉన్నవాడని తేలింది. ఇద్దరు భార్యలు, ఇద్దరు పిల్లలు ఉండి కూడా కాలేజీ అమ్మాయిని ప్రేమ పేరుతో తీసుకెళ్లిన ఈ ప్రైవేట్ బస్సు డ్రైవర్ ఉదంతం ఈరోడ్ పరిసర ప్రాంతాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
