రాజస్థాన్ రాష్ట్రంలోని కోటా ప్రాంతంలో బంధువులైన ఇద్దరు యువతులు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. కుటుంబ సభ్యుల వ్యతిరేకత నడుమ పోలీస్ స్టేషన్కు వచ్చిన వారు, ఆ తర్వాత విషం తాగిన ఘటన తీవ్ర కలకలం రేపింది.
కోటా నగరంలోని బోర్ఖేడా ప్రాంతానికి చెందిన ఈ ఇద్దరు యువతులు బంధువులు. వీరిద్దరి మధ్య మూడేళ్ల క్రితం ఏర్పడిన స్నేహం కాస్తా క్రమంగా ప్రేమగా మారింది. వీరి ప్రేమకు కుటుంబ సభ్యుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురుకావడంతో, ఐదు నెలల క్రితం ఇద్దరూ ఇళ్లను విడిచి వెళ్లిపోయి, విడిగా గది అద్దెకు తీసుకుని ఉంటూ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. దీనిపై కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు కూడా పెట్టారు.
ఈ క్రమంలో కుటుంబ సభ్యులు వారిని సంప్రదించి, బుజ్జగించి తిరిగి ఊరికి రప్పించారు. గత మంగళవారం ఇద్దరినీ తీసుకుని పోలీస్ స్టేషన్కు వెళ్లారు. అక్కడ పోలీసులు, తల్లిదండ్రులు విడిపోవాలని వారికి ఎంతగానో నచ్చజెప్పారు. కానీ, తామిద్దరం ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకుంటున్నామని, జీవితాంతం కలిసే ఉంటామని ఆ యువతులు తెగేసి చెప్పారు.
ఇద్దరూ మేజర్లు కావడంతో, పోలీసులు వారి వాంగ్మూలాన్ని నమోదు చేసుకుని వెళ్లేందుకు అనుమతించారు. అయితే, పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చిన కొద్దిసేపటికే ఇద్దరి ఆరోగ్య పరిస్థితి ఒక్కసారిగా విషమించింది. విచారణలో, వారు పోలీస్ స్టేషన్కు రాకముందే ఆత్మహత్య చేసుకునే ఉద్దేశంతో విషం తాగినట్లు తేలింది.
వెంటనే షాక్కు గురైన కుటుంబ సభ్యులు, పోలీసులు వారిని రక్షించి ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ వారికి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఆసుపత్రిలో సైతం తామిద్దరం కలిసే ఉండాలనుకుంటున్నట్లు ఆ యువతులు తేల్చి చెబుతున్నారని పోలీసులు తెలిపారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని, చర్చను రేకెత్తించింది.

Leave a Reply