“ఇద్దరూ డాక్టర్లే.. కానీ వేర్వేరు కులాలు!”.. ప్రేమను అంగీకరించని తల్లిదండ్రులు.. 3 పేజీల లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్న యువ డాక్టర్..!!!!

ఢిల్లీ: ఢిల్లీలోని సివిల్ లైన్స్ ప్రాంతంలో ఉన్న అరుణా అసఫ్ అలీ ప్రభుత్వ ఆసుపత్రిలోని ఒక గదిలో 35 ఏళ్ల యువ డాక్టర్ శవమై కనిపించడం రాజధానిలో తీవ్ర విషాదాన్ని, సంచలనాన్ని సృష్టించింది.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఢిల్లీ పోలీసులు వెంటనే ఆసుపత్రికి చేరుకున్నారు. అనస్థీషియా విభాగంలో గత మూడేళ్లుగా పనిచేస్తున్న డాక్టర్ సిమర్‌ప్రీత్ సింగ్ ఆనంద్, గదిలో అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గుర్తించారు. వెంటనే సహచర వైద్యులు పరీక్షించగా, ఆయన అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు. పంజాబ్‌లోని లూథియానాకు చెందిన డాక్టర్ ఆనంద్, జూలై 5 రాత్రి 8 గంటల నుండి ఉదయం 8 గంటల వరకు నైట్ డ్యూటీలో ఉన్నారు.

ఉదయం 9 గంటలైనా ఆయన డ్యూటీ గది తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చిన సహచర సిబ్బంది తలుపులు తట్టారు. లోపలి నుండి ఎటువంటి స్పందన రాకపోవడంతో, తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా ఈ విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. ఘటనా స్థలంలో డాక్టర్ ఆనంద్ రాసిన మూడు పేజీల ఆత్మహత్య లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆయన తన వ్యక్తిగత డైరీలో ఈ ఉద్వేగభరితమైన లేఖను రాశారు.

పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం, డాక్టర్ ఆనంద్‌కు మధ్యప్రదేశ్‌కు చెందిన ఒక మహిళా వైద్యురాలితో చాలా కాలంగా ప్రేమాయణం నడుస్తోంది. ఇద్దరూ వైద్యులైనప్పటికీ, “మీరు వైద్యులు కావొచ్చు, కానీ మీ కులాలు వేరు.. కాబట్టి ఈ పెళ్లి సాధ్యం కాదు” అని ఇరు కుటుంబాల వారు వారి ప్రేమను తీవ్రంగా వ్యతిరేకించారు. దీనివల్ల కలిగిన తీవ్రమైన మనస్తాపం మరియు ఒత్తిడి వల్లే డాక్టర్ ఆనంద్ తన ప్రాణాలను తీసుకునే దురదృష్టకర నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు.


Posted

in

by

Tags: