ఇన్‌కమ్ టాక్స్ యాక్ట్ 2025: ఏప్రిల్ 1 నుండి కొత్త పన్ను చట్టం.. ఏమేం మారబోతున్నాయో తెలుసుకోండి!

సామాన్యులకు అర్థం కాని రీతిలో ఉన్న పాత పన్ను నిబంధనలకు స్వస్తి పలుకుతూ, కేంద్ర ప్రభుత్వం **’ఇన్‌కమ్ టాక్స్ యాక్ట్ 2025’**ను తీసుకువస్తోంది. ఇది ఏప్రిల్ 1 నుండి అమలులోకి రానుంది. దాదాపు 64 ఏళ్ల నాటి పాత ‘ఇన్‌కమ్ టాక్స్ యాక్ట్ 1961’ స్థానంలో ఈ కొత్త చట్టం వస్తుంది.

కొత్త చట్టం ఎందుకు?

1961లో చేసిన పాత చట్టం నేటి ఆధునిక, డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు తగినట్లుగా లేదు. గత దశాబ్దాల్లో చేసిన వందలాది సవరణల వల్ల అది చాలా క్లిష్టంగా మారింది. దీనివల్ల సామాన్య పన్ను చెల్లింపుదారులు, సీనియర్ సిటిజన్లు పన్ను నిపుణుల సాయం లేకుండా రిటర్నులు దాఖలు చేయడం కష్టంగా మారింది. అందుకే ప్రభుత్వం ఈ చట్టాన్ని పూర్తిగా పునర్నిర్మించింది.

కొత్త చట్టంలోని ప్రత్యేకతలు:
  • తక్కువ నిడివి: కొత్త చట్టం పాతదాని కంటే దాదాపు 50 శాతం చిన్నదిగా ఉంటుంది. అనవసరమైన సెక్షన్లను తొలగించి భాషను చాలా సులభతరం చేశారు.
  • పన్ను రేట్లు మారవు: పన్ను చెల్లింపుదారులకు అతిపెద్ద ఊరట ఏమిటంటే.. టాక్స్ స్లాబ్‌లలో లేదా రేట్లలో ఎలాంటి మార్పు లేదు. పన్నులు మునుపటిలాగే ఉంటాయి, కానీ నిబంధనలు సులభంగా ఉంటాయి.
  • ట్యాక్స్ ఇయర్ (Tax Year): ఇప్పటివరకు ప్రజలను గందరగోళానికి గురిచేసే ‘ప్రీవియస్ ఇయర్’ మరియు ‘అసెస్‌మెంట్ ఇయర్’ అనే పదాలను తొలగించి, వాటి స్థానంలో కేవలం ‘ట్యాక్స్ ఇయర్’ అనే ఒకే పదాన్ని ప్రవేశపెట్టారు.
  • TDS రీఫండ్: ఒకవేళ పన్ను చెల్లింపుదారుడు గడువు తేదీ ముగిసిన తర్వాత రిటర్న్ దాఖలు చేసినా, అతనికి TDS రీఫండ్ పొందే హక్కు ఉంటుంది. ఇదివరకు ఇది ఇంత సులభం కాదు.
వివాదాలకు చెక్:

నిబంధనలు స్పష్టంగా ఉండటం వల్ల పన్ను విషయంలో ప్రభుత్వానికి, పౌరులకు మధ్య వచ్చే వివాదాలు మరియు కోర్టు కేసులు గణనీయంగా తగ్గుతాయని ప్రభుత్వం భావిస్తోంది. బడ్జెట్ 2026-27లో ప్రకటించే వ్యక్తిగత పన్ను, కార్పొరేట్ పన్ను లేదా HUF నిబంధనలన్నీ ఈ కొత్త చట్టం పరిధిలోకి వస్తాయి.


Posted

in

by

Tags: