మీరట్: మీరట్‌లోని సరూర్ పూర్‌కు చెందిన ప్రదీప్, శుక్రవారం ఉదయం తన 45 ఏళ్ల భార్య నిషా చౌహాన్‌ను కత్తితో పదేపదే పొడిచి దారుణంగా హత్య చేశాడు. స్థానిక హర్రా పట్టణంలో ఒక ప్లాట్ రిజిస్ట్రేషన్ విషయంలో జరిగిన గొడవ ఈ ఘోరానికి దారితీసింది. ప్లాట్ తన పేరు మీద ఉండాలని భార్యాభర్తల మధ్య గురువారం నుండే వాగ్వాదం జరుగుతోంది.
శుక్రవారం ఉదయం గొడవ మరింత తీవ్రరూపం దాల్చడంతో, ప్రదీప్ భార్యపై కత్తితో దాడి చేసి ఆమెను హతమార్చాడు. తల్లిని కాపాడటానికి వచ్చిన కుమారుడు కూడా ఈ దాడిలో గాయపడ్డాడు. ఆ తర్వాత, నిందితుడు ప్రదీప్ తనపై తాను కత్తితో పొడుచుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు.
పిల్లల కళ్లముందే రక్తపాతం నిషా చౌహాన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండేవారు. ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేస్తూ వేల సంఖ్యలో ఫాలోవర్లను సంపాదించుకున్నారు. అంతేకాకుండా, పట్టణంలో ఆమె సొంతంగా బ్యూటీ పార్లర్ నడుపుతున్నారు. శుక్రవారం ఉదయం ప్రదీప్ దాడి చేస్తున్నప్పుడు, రక్తపు మడుగులో పడి ఉన్న తల్లిని చూసి పిల్లలు భయంతో కేకలు వేశారు. శబ్దం విని పొరుగువారు వచ్చేసరికి నిషా ప్రాణాలు కోల్పోయారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
స్థానికులు వచ్చేసరికి ప్రదీప్ రక్తపు మడుగులో స్పృహ తప్పి పడి ఉన్నాడు. పోలీసులు వెంటనే అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ అతనికి చికిత్స అందుతోంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. నిషా మరణం తర్వాత ఆమె చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఘటన గురించి తెలుసుకున్న పోలీస్ అధికారులు, ఫోరెన్సిక్ బృందంతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. సిసిటివి ఫుటేజీని స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక విచారణలో ఆస్తి వివాదమే హత్యకు ప్రధాన కారణమని తేలిందని అధికారులు తెలిపారు. కేసు నమోదు చేసి తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.
