ఇన్‌స్టాగ్రామ్‌లో భార్య వేరొకరితో చేసిన చాట్‌లను మాత్రమే ఆధారంగా చేసుకుని, ఆమె వివాహేతర సంబంధంలో కొనసాగుతోందని చెప్పలేమని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది.
భార్యకు భరణం చెల్లించాలని కుటుంబ న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ భర్త హైకోర్టులో అప్పీల్ చేశాడు. తన భార్యకు ఒక న్యాయవాదితో వివాహేతర సంబంధం ఉందని, అందువల్ల ఆమెకు భరణం చెల్లించాల్సిన అవసరం లేదని భర్త వాదించాడు. దీనికి ఆధారంగా తన భార్యకు, సదరు వ్యక్తికి మధ్య ఇన్‌స్టాగ్రామ్‌లో జరిగిన చాట్‌ల ప్రింట్ అవుట్‌లను ఆయన కోర్టుకు సమర్పించాడు.
కానీ, ఆ చాట్‌లు మాత్రమే సరైన ఆధారం కాదని హైకోర్టు పేర్కొంది. సోషల్ మీడియాలో ఒకరితో ఒకరు చాట్ చేసుకున్నంత మాత్రాన, వారి మధ్య శారీరక సాన్నిహిత్యం లేదా సహజీవనం ఉన్నట్లు నిరూపించబడదని కోర్టు వ్యాఖ్యానించింది. వివాహేతర సంబంధం ఉందని ఆరోపించడానికి, దానిని నిర్ధారించే అదనపు ఆధారాలు ఉండాలని స్పష్టం చేసింది. కేవలం మాటామంతీ (సాధారణ సంభాషణలు), వృత్తిపరమైన పరిచయాలు లేదా అనుమానాలను బట్టి ఒక మహిళ వివాహేతర సంబంధంలో ఉందని నిర్ధారించలేమని కోర్టు తేల్చిచెప్పింది.
అంతేకాకుండా, భరణం నిరాకరించాలంటే భార్య నిరంతరం వివాహేతర సంబంధంలో కొనసాగుతోందని భర్త స్పష్టమైన, పక్కా ఆధారాలతో నిరూపించాలని కోర్టు తెలిపింది. ఏదో ఒకసారి జరిగినట్లు చెబుతున్న ఘటన లేదా కొన్ని చాట్‌ల ఆధారంగా దీన్ని నిరూపించలేమని పేర్కొంది. ఈ కేసులో సమర్పించిన ఇన్‌స్టాగ్రామ్ చాట్‌లకు చట్టపరమైన ధృవీకరణ (సర్టిఫికేషన్) కూడా లేదని కోర్టు ఎత్తిచూపింది. అందువల్ల ఆ డిజిటల్ రికార్డులను మాత్రమే పరిగణనలోకి తీసుకుని భర్త వాదనను అంగీకరించలేమని కోర్టు స్పష్టం చేసింది.
దీంతో, భార్యకు భరణం చెల్లించాలన్న కుటుంబ న్యాయస్థానం తీర్పులో జోక్యం చేసుకోవడానికి అలహాబాద్ హైకోర్టు నిరాకరించింది. భర్త దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. సోషల్ మీడియా చాట్‌లు ఉన్నంత మాత్రాన ఒకరి వివాహేతర సంబంధాన్ని నిరూపించడానికి అవి సరిపోవని ఈ తీర్పు స్పష్టం చేస్తోంది. ఆ ఆరోపణలను నిర్ధారించే పక్కా ఆధారాలు ఉంటేనే న్యాయస్థానం దానిని పరిగణనలోకి తీసుకుంటుందని ఈ కేసులో స్పష్టమైంది.

Leave a Reply