చెన్నైలోని ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన యువకుడు, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ను పెళ్లి చేసుకోవాలనే తన కోరికను తెలిపేందుకు ఢిల్లీ వెళ్లగా.. అక్కడ దాడికి గురై ప్రాణాలు కోల్పోయిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆరు లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్న నేహా బిష్ట్‌ను వివాహం చేసుకోవాలని ఆశపడిన అభినవ్ (25), నేరుగా ఆమె ఇంటికే వెళ్లాడు. ఈ ఘటనకు సంబంధించి నేహా తండ్రితో పాటు పొరుగింటి వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్ జిల్లాకు చెందిన అభినవ్, చెన్నైలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. గత నవంబర్ 7న ఢిల్లీలోని మధు విహార్ ప్రాంతంలో ఉన్న నేహా ఇంటికి వెళ్లిన అతడు, ఆ సమయంలో మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడ నేహాను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు చెప్పి, అందుకు ఒప్పుకోవాలని పట్టుబట్టాడు. దీంతో తలెత్తిన గొడవ నేపథ్యంలో నేహా కుటుంబ సభ్యులు, ఇరుగుపొరుగు వారు అభినవ్‌పై దాడి చేసినట్లు సమాచారం.
అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, వీపు మరియు కుడి కాలిపై తీవ్ర గాయాలతో ఉన్న అభినవ్‌ను రక్షించి రాజీవ్ గాంధీ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ వారం రోజుల పాటు చికిత్స పొందిన అతడు, నవంబర్ 15న చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో ఈ ఘటనతో సంబంధం ఉన్న నేహా తండ్రిని, పొరుగింటి వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసుల విచారణలో.. అభినవ్ నిరంతరం నేహా సోషల్ మీడియా పోస్టులను చూస్తుండేవాడని, ఆమెపై ఏకపక్ష ప్రేమ (వన్-సైడ్ లవ్) పెంచుకున్నాడని తేలింది. కొన్ని నెలల క్రితమే ఓ అభిమానిగా నేహా ఇంటికి వెళ్లినట్లు కూడా సమాచారం వెలువడింది. నేహాకు అతడు ఎవరో తెలియదని, ఆమెకు త్వరలో పెళ్లి జరగనుండటంతో అభినవ్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు తదుపరి దర్యాప్తు జరుపుతున్నారు.

Leave a Reply