భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన ఓ యువకుడి ప్రేమ వలయంలో చిక్కుకున్న 18 ఏళ్ల కాలేజీ విద్యార్థినిని.. పోలీసులు అత్యంత చాకచక్యంగా శ్రమించి సురక్షితంగా రక్షించారు.
సోషల్ మీడియాలో లగ్జరీ లైఫ్ చూపిస్తూ సదరు విద్యార్థినిని నమ్మించి మోసం చేసిన సదరు యువకుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.
షాడోల్ జిల్లాకు చెందిన ఓ మొదటి సంవత్సరం కాలేజీ విద్యార్థినితో సోషల్ మీడియా ద్వారా కరణ్ ధానుక్ అనే యువకుడు పరిచయం పెంచుకున్నాడు. ఇన్‌స్టా చాటింగ్‌లో తాను పెద్ద బిజినెస్మెన్ అని, కోటీశ్వరుడినని ఆమెకు పరిచయం చేసుకున్నట్లు సమాచారం.
లగ్జరీ లైఫ్ వెనుక అసలు ముసుగు:
గ్వాలియర్ ప్రాంతానికి చెందిన ఈ కరణ్ ధానుక్.. నిజానికి ఇళ్లలో గోడలకు పుట్టీ, పెయింటింగ్ పనులు చేసే ఒక సాధారణ పెయింటర్. తాను పని కోసం వెళ్లే పెద్ద పెద్ద లగ్జరీ బంగళాలు, విల్లాలు, లగ్జరీ కార్ల ముందు నిలబడి ఫోటోలు, వీడియోలు తీసుకునేవాడు. వాటిని తన సోషల్ మీడియా ఖాతాలో అప్లోడ్ చేస్తూ రీల్స్ చేసేవాడు.
ఇన్‌స్టాగ్రామ్‌లో తన పేరును ‘కరణ్ రాజ్‌పుత్’గా మార్చుకుని, లగ్జరీ లైఫ్ మెయింటైన్ చేస్తున్నట్లు అతడు పెట్టిన పోస్టులను చూసి సదరు కాలేజీ అమ్మాయి నిజమేనని నమ్మింది. ఈ క్రమంలోనే అతడితో మరింత క్లోజ్‌గా మూవ్ అవ్వడం ప్రారంభించింది. కొన్ని రోజుల క్రితం, ఆ పెయింటర్ నమ్మకమైన మాటలు చెప్పి ఆ అమ్మాయిని తనతో పాటు తీసుకెళ్లిపోయినట్లు పోలీసుల విచారణలో తేలింది.
కూతురు ఎంతకీ ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు జైత్పూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనితో రంగంలోకి దిగిన పోలీసులు సైబర్ క్రైమ్ విభాగం సహాయంతో మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా దర్యాప్తును ముమ్మరం చేశారు. చివరకు మొరెనా జిల్లాలోని ఒక గ్రామంలో సదరు విద్యార్థినిని దాచి ఉంచినట్లు పోలీసులు గుర్తించారు.
సురక్షితంగా రక్షించిన పోలీసులు:
పక్కా సమాచారంతో అక్కడికి చేరుకున్న ప్రత్యేక పోలీస్ బృందం.. కాలేజీ అమ్మాయిని సురక్షితంగా రక్షించింది. అయితే పోలీసులు వస్తున్నారనే విషయం ముందే గమనించిన పెయింటర్ కరణ్ ధానుక్ అక్కడి నుండి చాకచక్యంగా పరారయ్యాడు.
రక్షించిన విద్యార్థినిని పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. సోషల్ మీడియాలో కనిపించే నకిలీ ప్రొఫైల్స్, లగ్జరీ ఫోటోలను నమ్మడం వల్ల ఎలాంటి ప్రమాదాలు ఎదురవుతాయో ఈ ఘటన మరోసారి నిరూపించింది.
