సోషల్ మీడియాలో ఏర్పడిన పరిచయంతో ప్రేమ వివాహం చేసుకున్న ఒక యువతి, మొదటిసారి అత్తగారింటికి (మెట్టినింటికి) వెళ్లిన కొద్ది గంటల్లోనే అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఆజంగఢ్ (Azamgarh) ప్రాంతానికి చెందిన 22 ఏళ్ల అస్కా, మవూ (Mau) జిల్లాకు చెందిన హరిశ్చంద్రన్లకు ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో గత మే నెలలో వీరు వివాహం చేసుకున్నారు.
పెళ్లయిన తర్వాత కూడా పుట్టింట్లోనే ఉంటున్న అస్కాను.. గత శుక్రవారం రాత్రి ఆమె భర్త హరిశ్చంద్రన్ మొదటిసారిగా తన ఇంటికి (అత్తగారింటికి) తీసుకెళ్లాడు.
కానీ, మరుసటి రోజు ఉదయం 10 గంటల ప్రాంతంలో అస్కా చనిపోయినట్లు ఆమె కుటుంబ సభ్యులకు హఠాత్తుగా ఫోన్ ద్వారా సమాచారం అందింది. దీంతో కన్నీరుమున్నీరుగా విలపించిన తల్లిదండ్రులు.. అదనపు కట్నం కోసం వేధించి తమ కుమార్తెను వారే కొట్టి చంపారని తీవ్రంగా ఆరోపిస్తున్నారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, భర్త సహా ఐదుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్ట్మార్టం నివేదిక వచ్చిన తర్వాతే మరణానికి గల అసలు కారణం ఏమిటనేది స్పష్టంగా తెలుస్తుందని పోలీసులు తెలిపారు.

Leave a Reply