ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన చేయాల్సిన సమయంలో సినీ పాటలకు డ్యాన్సులు చేస్తూ రీల్స్ విడుదల చేస్తున్న ఉదంతం తీవ్ర దుమారాన్ని రేపుతోంది.
విద్యార్థుల ముందే ఉపాధ్యాయినులు చిందులేస్తున్న దృశ్యాలు ఇంటర్నెట్‌లో వైరల్ కావడంతో పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది.
ముజఫర్‌నగర్ జిల్లాలోని ఖతౌలి మరియు పుర్ఖాజీ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ వింత ఘటనలు వెలుగుచూశాయి. క్లాస్‌రూమ్‌లలో పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన టీచర్లు, స్కూల్ టైమ్‌ను వృథా చేస్తూ సినీ పాటలకు స్టెప్పులేసిన వీడియోలు సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపిస్తున్నాయి.
టీచర్లు తాము ఒక్కరే డ్యాన్స్ చేయడంతో ఆగకుండా, పాఠశాలలో చదివే చిన్న పిల్లలను కూడా భాగస్వాములను చేసి సినిమా స్టైల్‌లో డ్యాన్సులు చేయించారు. అంతేకాకుండా, పాఠశాల ప్రాంగణంలోనే ప్రమాదకరమైన రీతిలో స్టంట్లు చేస్తూ వీడియోలు రికార్డు చేసి ఆన్‌లైన్‌లో పోస్ట్ చేశారు. భావి భారత పౌరులను తీర్చిదిద్దాల్సిన బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నవారే ఇలా ప్రవర్తించడం తల్లిదండ్రుల ఆగ్రహానికి కారణమైంది.
ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు క్రమంగా తగ్గుతున్న తరుణంలో, ఉపాధ్యాయుల ఈ బాధ్యతారాహిత్య ప్రవర్తనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థులకు క్రమశిక్షణ, విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువులు.. తమ వ్యక్తిగత సోషల్ మీడియా పేజీల రీల్స్ పిచ్చి కోసం స్కూళ్లను ఉపయోగించుకోవడం ఎంతవరకు సమంజసమని సామాజిక కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు.
ఈ వీడియోలు వైరల్ కావడంతో ముజఫర్‌నగర్ జిల్లా ప్రాథమిక విద్యాశాఖ రంగంలోకి దిగింది. దీనిపై జిల్లా బేసిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ (BSA) సందీప్ కుమార్ మాట్లాడుతూ, “ఈ వ్యవహారం ఈరోజే నా దృష్టికి వచ్చింది. వెంటనే సంబంధిత మండల విద్యాశాఖ అధికారులను (BEO) సంప్రదించి సమగ్ర విచారణకు ఆదేశించాను. బాధ్యులైన టీచర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేసి వివరణ కోరాము” అని తెలిపారు.

Leave a Reply