హైదరాబాద్‌లోని కేజీ రెడ్డి కళాశాలలో కంప్యూటర్ సైన్స్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న అభిరామ్ అనే 18 ఏళ్ల విద్యార్థి, తన విద్యా రుణాన్ని తీర్చడం కోసం పగలు బీటెక్ చదువుతూ, రాత్రి పూట సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు.
అతడి కుటుంబం తీసుకున్న రూ. 10 లక్షల ఎడ్యుకేషన్ లోన్ కోసం నెలకు రూ. 27,000 ఈఎంఐ (EMI) చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. దీంతో తండ్రికి వచ్చే రూ. 16,000 జీతానికి, తాను రాత్రిళ్లు సెక్యూరిటీ డ్యూటీ చేయడం ద్వారా సంపాదిస్తున్న రూ. 13,000 కలిపి ఆ లోన్‌ను తీరుస్తున్నాడు.
‘బీటెక్ సెక్యూరిటీ వాలా’ (BTech Security Wala) అనే పేరుతో తన రోజువారీ జీవితంలోని సవాళ్లను, అవగాహన కల్పించే వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటున్న ఇతడు.. సోషల్ మీడియాలో యువత నుంచి మంచి ఆదరణ పొంది పాపులర్ అయ్యాడు.
నిజాయితీగా చేసే ఏ పనీ తక్కువ కాదని, ఇతరుల విమర్శలకు భయపడి కుటుంబ భారాన్ని పంచుకోకపోవడం తప్పు అని నిరూపిస్తూ.. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఎంతోమంది విద్యార్థులకు ఇతడు ఒక గొప్ప ఆదర్శంగా నిలుస్తున్నాడు.
పాపులర్ అవ్వడం తన లక్ష్యం కాదని చెబుతున్న అభిరామ్.. తన ఇంజనీరింగ్ విద్యను విజయవంతంగా పూర్తి చేసి, భవిష్యత్తులో పేద విద్యార్థులకు అందుబాటు ధరలో లేదా ఉచితంగా విద్యను అందించడమే తన జీవిత లక్ష్యమని చెబుతున్నాడు.

Leave a Reply