ఇమ్రాన్ ఖాన్ జట్టులో సచిన్ ఫీల్డింగ్! మాస్టర్ బ్లాస్టర్ పాకిస్థాన్ తరపున మైదానంలోకి దిగిన ఆ అరుదైన కథ

భారత క్రికెట్ గర్వకారణంగా మారడానికి రెండేళ్ల ముందే, 13 ఏళ్ల సచిన్ టెండూల్కర్ పాకిస్థాన్ జెర్సీ ధరించి మైదానంలోకి అడుగుపెట్టారు. 1987లో ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో జరిగిన ఒక ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో ఆటగాళ్ల కొరత ఏర్పడటంతో, ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్థాన్ జట్టు తరపున సచిన్ సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా పనిచేశారు. విధి వైచిత్రి ఏమిటంటే.. భవిష్యత్తులో ఏ జట్టుకైతే చుక్కలు చూపించారో, అదే జట్టుతో సచిన్ మొదటి ‘అంతర్జాతీయ’ అనుభవం మొదలైంది.

ఏం జరిగింది?: జనవరి 20, 1987న క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా (CCI) గోల్డెన్ జూబ్లీ సందర్భంగా భారత్-పాకిస్థాన్ మధ్య 40 ఓవర్ల మ్యాచ్ జరిగింది. భారత జట్టు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో, లంచ్ బ్రేక్ తర్వాత పాక్ ఆటగాళ్లు జావేద్ మియాందాద్, అబ్దుల్ ఖాదిర్ విశ్రాంతి కోసం వెళ్లారు. మైదానంలో ఆటగాళ్లు తక్కువగా ఉండటంతో ఇమ్రాన్ ఖాన్ ఫీల్డర్ల కోసం అడిగారు. అప్పుడు అక్కడ ఉన్న 13 ఏళ్ల సచిన్, మరాఠీలో “మీ జౌ కా?” (నేను వెళ్లనా?) అని తన కోచ్‌ను అడిగి, వెంటనే పాకిస్థాన్ జట్టు తరపున ఫీల్డింగ్ చేయడానికి వెళ్లారు. సుమారు 25 నిమిషాల పాటు ఆయన ఆ జట్టు కోసం ఫీల్డింగ్ చేశారు.

సచిన్ ఆటోబయోగ్రఫీలో ప్రస్తావన: తన ఆత్మకథ ‘ప్లేయింగ్ ఇట్ మై వే’లో సచిన్ ఈ విషయాన్ని గుర్తు చేసుకున్నారు. “భారత్ తరపున 1989లో అరంగేట్రం చేయడానికి ముందే, 1987లో పాకిస్థాన్ తరపున ఫీల్డింగ్ చేశాను. ఇమ్రాన్ ఖాన్‌కు ఈ విషయం గుర్తుందో లేదో తెలియదు కానీ, నేను ఆ రోజు భారత్‌కు వ్యతిరేకంగా ఫీల్డింగ్ చేశాను” అని రాశారు. ఒకవేళ ఆ మ్యాచ్‌లో కపిల్ దేవ్ ఇచ్చిన క్యాచ్‌ను తాను పట్టుకుని ఉంటే చరిత్ర మరోలా ఉండేదేమో అని ఆయన సరదాగా వ్యాఖ్యానించారు.


Posted

in

by

Tags: