మధ్యప్రాచ్య యుద్ధంలో ఇరాన్‌కు అండగా నిలిచిన రష్యా అధ్యక్షుడు పుతిన్, ఇప్పుడు తన స్వప్రయోజనాల కోసం ఇరాన్‌ను పక్కన పెట్టేందుకు సిద్ధమయ్యారు. అమెరికా ఆయుధాల రహస్యాలను ఇరాన్‌కు చేరవేసిన పుతిన్, ఇప్పుడు అదే అంశాన్ని అడ్డం పెట్టుకుని అమెరికాను బ్లాక్మెయిల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇరాన్‌కు సహాయం ఆపాలంటే తన షరతును ఒప్పుకోవాలని ఆయన ట్రంప్‌కు ఆఫర్ ఇచ్చారు.
పుతిన్ మాస్టర్ స్ట్రోక్: ఇరాన్‌ను నట్టేట ముంచే ప్లాన్? మయామిలో జరిగిన ఒక రహస్య సమావేశంలో పుతిన్ దూత కిరిల్ డిమిత్రీవ్, ట్రంప్ సలహాదారులు స్టీవ్ విట్కాఫ్ మరియు జారెడ్ కుష్నర్‌లను కలిశారు. ఉక్రెయిన్‌కు అమెరికా అందిస్తున్న సైనిక సహాయం మరియు రష్యా సైన్యానికి సంబంధించిన ఇంటెలిజెన్స్ సమాచారాన్ని ఆపివేస్తే, తాము కూడా ఇరాన్‌కు అమెరికా స్థావరాల సమాచారాన్ని ఇవ్వడం ఆపివేస్తామని పుతిన్ సందేశం పంపారు.
ప్రస్తుతం రష్యా తన శాటిలైట్ల ద్వారా మధ్యప్రాచ్యంలో అమెరికా నౌకలు, సైన్యం ఎక్కడ ఉన్నాయనే ఖచ్చితమైన సమాచారాన్ని ఇరాన్‌కు అందిస్తోంది. దీనివల్ల ఇరాన్ దాడులు చేయడం సులభమవుతోంది. ఇప్పుడు ఇదే సమాచారాన్ని ఒక ‘ఆయుధంగా’ మార్చుకుని పుతిన్, ట్రంప్‌తో బేరమాడుతున్నారు.
ట్రంప్ ముందున్న సవాలు: ఉక్రెయిన్ కావాలా? ఇరాన్ కావాలా? ప్రస్తుతానికి ట్రంప్ యంత్రాంగం ఈ ప్రతిపాదనను తిరస్కరించినప్పటికీ, ఈ చర్చలు ఐరోపా మరియు ఇరాన్ వర్గాల్లో వణుకు పుట్టించాయి. పుతిన్ ఆఫర్ వల్ల నాటో (NATO) దేశాలు ఒంటరి అవుతాయని ఐరోపా భయపడుతోంది. ఇప్పటికే నాటో దేశాలను ట్రంప్ ‘పిరికివారు’ అని విమర్శించిన సంగతి తెలిసిందే.
మోజ్తబా ఖమేనీకి ముప్పు: ఇరాన్ తదుపరి వారసుడిగా భావిస్తున్న మోజ్తబా ఖమేనీకి ఇది పెద్ద దెబ్బ. రష్యా తమకు రక్షణ కవచంగా ఉంటుందని భావించి ఇరాన్ డ్రోన్లు, మిసైళ్లను సరఫరా చేసింది. కానీ పుతిన్ ఆఫర్ చూస్తుంటే రష్యాకు తన సొంత ప్రయోజనాలే ముఖ్యమని తేలిపోయింది. ఒకవేళ రష్యా ఇంటెలిజెన్స్ సమాచారం ఆపివేస్తే, అమెరికా దాడుల ముందు ఇరాన్ ‘కళ్లు లేని వాడిలా’ (అంధుడిలా) మారిపోతుంది.
