పశ్చిమ ఆసియాలో పరిస్థితి అత్యంత భయంకరంగా మారింది. ఇరాన్ దీవి ‘ఖర్గ్’ పై అమెరికా జరిపిన భారీ దాడి యుద్ధ గమనాన్ని మార్చేసింది. ఈ దాడి నేరుగా చైనా ప్రయోజనాలపై దెబ్బకొట్టింది.
ఈ ఉద్రిక్తతల మధ్య ఇరాన్‌తో భారతదేశ దౌత్య సంబంధాలు గణనీయంగా మెరుగుపడ్డాయి. ఇరు దేశాల అగ్ర నాయకత్వాల మధ్య చర్చలు జరిగాయి. ఫలితంగా, ఇరాన్ తన ఆధీనంలో ఉన్న హోర్ముజ్ జలసంధి (Strait of Hormuz) గుండా రెండు భారతీయ ట్యాంకర్లను వెళ్ళడానికి అనుమతించింది. ఆ రెండు ట్యాంకర్లు సురక్షితంగా భారత్ చేరుకున్నాయి. అయితే, ప్రపంచ దేశాలను అడ్డుకుంటున్న ఇరాన్, భారత్‌కు మాత్రం ఎందుకు ఈ వెసులుబాటు కల్పించింది?
ఇరాన్‌తో జరిగిన ఆ ఒప్పందం ఏంటి? ప్రముఖ వ్యూహాత్మక వ్యవహారాల నిపుణుడు బ్రహ్మ చెల్లానీ దీని వెనుక ఉన్న అసలు కారణాన్ని వివరించారు. భారత్-ఇరాన్ మధ్య ఒక ప్రత్యేక ఒప్పందం జరిగిందని, దాని ఫలితంగానే ‘శివాలిక్’ మరియు ‘నందదేవి’ అనే ట్యాంకర్లు భారత్ చేరుకున్నాయని ఆయన తెలిపారు.
బ్రహ్మ చెల్లానీ విశ్లేషణ ప్రకారం.. భారత్ తన వద్ద ఉన్న సుమారు 180 మంది ఇరాన్ నౌకాదళ సిబ్బందిని తిరిగి వారి దేశానికి పంపడానికి అనుమతించింది. దీనికి ప్రతిఫలంగా, హోర్ముజ్ జలసంధిలో చిక్కుకున్న రెండు భారతీయ ట్యాంకర్లను విడిచిపెట్టడానికి టెహ్రాన్ అంగీకరించింది. ఈ ఒప్పందం గురువారం-శుక్రవారం మధ్య కొలిక్కి వచ్చింది. దీని ప్రకారం, కొచ్చిలో దిగిన ఒక ప్రత్యేక చార్టర్ ఫ్లైట్ ఇరాన్ నావికులను తీసుకుని టెహ్రాన్ వెళ్ళింది. వీరంతా ‘ఐఆర్ఐఎస్ లవన్’ అనే నౌకకు చెందిన వారు. అమెరికా దాడుల తర్వాత ఈ నౌక కొచ్చిలో ఆశ్రయం పొందింది.
శ్రీలంక ఎందుకు పంపలేదు? మార్చి 4న హిందూ మహాసముద్రంలో అమెరికా సబ్‌మెరైన్ దాడిలో ఇరాన్ యుద్ధ నౌక ‘ఐఆర్ఐఎస్ దేనా’ మునిగిపోయింది. ఈ ఘటనలో 87 మంది నావికులు మరణించగా, 32 మందిని రక్షించారు. శ్రీలంక సమీపంలోని అంతర్జాతీయ జలాల్లో ఈ ఘటన జరిగింది. అయితే, శ్రీలంక ఆ నావికుల మృతదేహాలను ఇరాన్‌కు అప్పగించినప్పటికీ, ప్రాణాలతో ఉన్న మిగిలిన 208 మంది సిబ్బందిని మరియు రక్షించబడిన 32 మందిని ఇరాన్‌కు పంపలేదు. కానీ భారత్ మాత్రం మానవతా దృక్పథంతో ఇరాన్ నావికులకు ఆశ్రయం కల్పించి, వారిని సురక్షితంగా పంపించివేసింది.
దీనిని బ్రహ్మ చెల్లానీ ‘క్విడ్ ప్రో క్వి’ (Quid Pro Quo) అని అభివర్ణించారు. అంటే భారత్ సహాయం చేసినందుకు ప్రతిగా, ఇరాన్ కూడా భారత చమురు ట్యాంకర్లకు సురక్షిత మార్గాన్ని కల్పించింది. భారత్‌కు అవసరమైన 40 శాతం ముడి చమురు మరియు ఖతార్ నుండి వచ్చే ఎల్పీజీ (LPG) సరఫరా హోర్ముజ్ జలసంధి గుండానే రావాలి. ప్రస్తుతానికి 22 ట్యాంకర్లు ఇంకా అక్కడ చిక్కుకున్నట్లు సమాచారం.
