ఇరాన్‌ను అంతం చేసేందుకు.. మాతో చేరండి! నెతన్యాహు పిలుపు.. నిశితంగా గమనిస్తున్న ప్రపంచ దేశాలు

టెల్ అవీవ్: ఇరాన్‌ను రెచ్చగొట్టి, ఇప్పుడు ఆ దేశానికి వ్యతిరేకంగా అందరూ తమతో చేరాలని ఇజ్రాయెల్ ప్రధాని బెెంజమిన్ నెతన్యాహు కోరుతున్నారు. ప్రపంచ దేశాలన్నీ ఏకమై ఇరాన్‌ను అణచివేయాలని ఆయన ఉద్ఘాటించారు.

ఇజ్రాయెల్‌లోని ఆరాద్ ప్రాంతంలో ఇరాన్ జరిపిన క్షిపణి దాడుల స్థలాన్ని సందర్శించిన నెతన్యాహు, ఇరాన్‌కు వ్యతిరేకంగా అమెరికా మరియు ఇజ్రాయెల్‌తో చేతులు కలపాలని ప్రపంచ దేశాల నాయకులకు పిలుపునిచ్చారు. గత 48 గంటల్లో జరిగిన సంఘటనలు ఇరాన్ కేవలం ఇజ్రాయెల్‌కే కాకుండా, మొత్తం అంతర్జాతీయ సమాజానికే ప్రమాదకరమైన దేశమని నిరూపించాయని ఆయన పేర్కొన్నారు.

ముఖ్యంగా జెరూసలేంలోని మూడు ప్రధాన మతాలకు (యూదు, క్రైస్తవ, ఇస్లాం) అత్యంత పవిత్రమైన పశ్చిమ గోడ (Western Wall), హోలీ సెపల్చర్ చర్చి మరియు అల్-అక్సా మసీదులను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులు చేసిందని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా, ఇరాన్ ఉద్దేశపూర్వకంగా పౌర నివాస ప్రాంతాలపై దాడులు చేసిందని, ఆరాద్ మరియు డిమోనా నగరాలపై జరిగిన బాలిస్టిక్ క్షిపణి దాడుల్లో పిల్లలతో సహా 100 మందికి పైగా గాయపడ్డారని నెతన్యాహు తెలిపారు.

“ఎవరూ చనిపోకపోవడం మన అదృష్టం మాత్రమే, కానీ ఇరాన్ ఉద్దేశం అది కాదు. అమాయక ప్రజలను పొట్టనబెట్టుకోవడమే వారి లక్ష్యం” అని నెతన్యాహు ఘాటుగా విమర్శించారు. హార్ముజ్ జలసంధి వంటి అంతర్జాతీయ సముద్ర మార్గాలను మళ్లించి ప్రపంచ దేశాలను ఇరాన్ బెదిరిస్తోందని, దీనికి ముగింపు పలకాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన అన్నారు. ఈ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న కఠిన నిర్ణయాన్ని నెతన్యాహు స్వాగతించారు.

చేదు నిజం: ఇజ్రాయెల్ ఎన్ని ఆరోపణలు చేసినప్పటికీ, వాస్తవానికి ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ వల్లనే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు ఇరాన్‌లో 1500 మందికి పైగా మరణించగా, ఇజ్రాయెల్‌లో ఆ సంఖ్య 200 లోపే ఉంది. అంతేకాకుండా, ఈ యుద్ధం కారణంగా ఇరాన్ భారీ ఆర్థిక నష్టాలను చవిచూసింది.


Posted

in

by

Tags: