ఇరాన్‌లోని బుషెహర్ (Bushehr) అణు విద్యుత్ కేంద్రం సమీపంలో శనివారం జరిగిన శక్తివంతమైన పేలుడులో ఒక భద్రతా సిబ్బంది మరణించారు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి ఈ వ్యూహాత్మక ప్రాంతంపై దాడి జరగడం ఇది నాలుగోసారి.
అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (IAEA) సమాచారం ప్రకారం.. ఈ పేలుడులో అణు ప్లాంట్ రక్షణ విభాగంలో పనిచేస్తున్న ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడి వల్ల అణు కేంద్రం ఆవరణలోని ఒక భవనం దెబ్బతింది. అయితే, అణు ప్లాంట్ నుండి ఎటువంటి రేడియేషన్ లీకేజీ జరగలేదని, రేడియేషన్ స్థాయిలు సాధారణంగానే ఉన్నాయని అధికారులు ధృవీకరించారు.
ఈ దాడిపై IAEA డైరెక్టర్ జనరల్ రాఫెల్ మారియానో గ్రాస్సీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అణు విద్యుత్ కేంద్రాలు లేదా వాటి పరిసర ప్రాంతాలపై ఏ పరిస్థితుల్లోనూ దాడులు జరగకూడదని ఆయన స్పష్టం చేశారు. అణు రియాక్టర్లే కాకుండా, అక్కడ ఉన్న ఇతర భవనాల్లో కూడా కీలకమైన భద్రతా వ్యవస్థలు ఉంటాయని, ఇటువంటి దాడులు కొనసాగితే అది ఒక పెద్ద అణు విపత్తుకు దారితీస్తుందని ఆయన హెచ్చరించారు.
అమెరికా, ఇస్మాయిల్‌లపై ఇరాన్ ఆరోపణలు: ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాక్చీ.. బుషెహర్ అణు ప్లాంట్‌పై జరుగుతున్న వరుస దాడులకు అమెరికా మరియు ఇస్మాయిల్‌లే కారణమని ఆరోపించారు. ఇప్పటివరకు ఈ ప్లాంట్‌పై 4 సార్లు దాడులు జరిగాయని, ఒకవేళ రేడియేషన్ లీకేజీ సంభవిస్తే దాని ప్రభావం తెహ్రాన్ కంటే గల్ఫ్ దేశాల రాజధానులపైనే (దుబాయ్, దోహా, కువైట్ మొదలైనవి) ఎక్కువగా ఉంటుందని ఆయన హెచ్చరించారు. పాశ్చాత్య దేశాల ద్వంద్వ వైఖరిని ఆయన తీవ్రంగా ఖండించారు.
రష్యా డిమాండ్: మరోవైపు, బుషెహర్ అణు ప్లాంట్‌లో పనిచేస్తున్న తమ దేశ సిబ్బందిని సురక్షితంగా తరలించేందుకు వీలుగా అమెరికా మరియు ఇస్మాయిల్ తాత్కాలికంగా యుద్ధాన్ని నిలిపివేయాలని రష్యా కోరింది. అక్కడ ఉన్న సుమారు 200 మంది రష్యన్ సిబ్బందిని తరలించే ప్రక్రియ వచ్చే వారం చివరి దశకు చేరుకోనుంది. వారు వెళ్లే మార్గంలో ఎటువంటి సైనిక చర్యలు ఉండకూడదని రష్యాకు చెందిన ‘రోసాటమ్’ అణు సంస్థ నొక్కి చెప్పింది. అణు కేంద్రం చుట్టూ నెలకొన్న ఈ ఉద్రిక్త పరిస్థితులతో గల్ఫ్ ప్రాంతమంతా హై అలర్ట్‌లో ఉంది.
