ఇరాన్ మరియు అమెరికా మధ్య ప్రత్యక్ష యుద్ధం ప్రస్తుతానికి ఆగిపోయినట్లు కనిపిస్తున్నప్పటికీ, ఇస్లామాబాద్‌లో కాల్పుల విరమణ చర్చలకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈలోగా, ఇరాన్ తరపున చైనా పోషిస్తున్నట్లు చెబుతున్న పాత్ర అమెరికా ఆందోళనను మరింత పెంచింది.
ఐక్యరాజ్యసమితిలో అమెరికా మాజీ రాయబారి నిక్కీ హేలీ చేసిన వాదనలు, తాజా పరిణామాలు ఇరాన్-అమెరికా ఘర్షణలో చైనా నేరుగా ప్రవేశించే అవకాశాన్ని సూచిస్తున్నాయి. అందుకే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా అప్రమత్తమయ్యారు. ఇరాన్ చర్చలకు నిరాకరిస్తున్నప్పటికీ, ట్రంప్ తన ఉపాధ్యక్షుడు జెడి వెన్స్‌ను పాకిస్తాన్‌కు పంపడానికి ఇదే కారణమని తెలుస్తోంది.
నౌకలో దొరికిన మిస్సైల్ రసాయనాలు? ఇటీవల అమెరికా సైన్యం ‘స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్’ (హోర్ముజ్ జలసంధి)లో స్వాధీనం చేసుకున్న ఇరాన్ నౌక చైనా నుండి ఇరాన్ వైపు వెళ్తోందని నిక్కీ హేలీ వాదించారు. ఈ నౌకలో క్షిపణుల తయారీలో ఉపయోగించే ప్రమాదకర రసాయన పదార్థాలు ఉన్నట్లు ఆమె పేర్కొన్నారు.
చైనాపై హేలీ హెచ్చరిక: చైనా ఇరాన్ పాలనకు బలం చేకూరుస్తోందని, దీనిని విస్మరించలేమని హేలీ స్పష్టం చేశారు. హోర్ముజ్ జలసంధి దిగ్బంధనంపై ఉద్రిక్తతలు గరిష్ట స్థాయిలో ఉన్న సమయంలో ఆమె ఈ ప్రకటన చేశారు. ఇరాన్ అణు కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి అమెరికా ‘స్పెషల్ ఫోర్స్’ను రంగంలోకి దించాల్సి రావచ్చునని, ఇది ప్రమాదకరమైన మిషన్ అయినప్పటికీ ఇరాన్ సైనిక శక్తిని బలహీనపరచడానికి అవసరమని ఆమె హెచ్చరించారు.
ఆ నౌకలో ఏముంది? శనివారం రాత్రి అమెరికా దళాలు ‘టూస్కా’ అనే ఇరాన్ జెండా ఉన్న కంటైనర్ నౌకను అదుపులోకి తీసుకున్నాయి. సముద్ర భద్రతా వర్గాల సమాచారం ప్రకారం.. ఈ నౌకలో పౌర మరియు సైనిక అవసరాలకు ఉపయోగపడే ‘డ్యూయల్ యూజ్’ పరికరాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. వీటి వల్ల ఇరాన్ సైనిక బలం పెరిగే ప్రమాదం ఉందని అమెరికా భావిస్తోంది.
చైనా స్పందన: మరోవైపు, తన నౌకను బలవంతంగా ఆపడంపై చైనా ఆందోళన వ్యక్తం చేసింది. బాధ్యతాయుతంగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాటించాలని చైనా విదేశాంగ మంత్రి గువో జియాకున్ పిలుపునిచ్చారు. హోర్ముజ్ జలసంధిలో పరిస్థితి సున్నితంగా ఉందని, ఉద్రిక్తతలు పెంచకుండా సాధారణ రాకపోకలకు వీలు కల్పించాలని కోరారు.
ట్రంప్ భిన్నమైన వాదన: అయితే, డొనాల్డ్ ట్రంప్ మాత్రం దీనిపై భిన్నమైన వైఖరిని ప్రదర్శించారు. ఇరాన్‌కు ఆయుధాలు సరఫరా చేయకూడదనే విషయమై చైనా అంగీకరించిందని ఆయన బుధవారం క్లెయిమ్ చేశారు. అంతర్జాతీయ వాణిజ్యం మరియు చమురు సరఫరా కోసం హోర్ముజ్ జలసంధిని శాశ్వతంగా తెరవడానికి కృషి చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. త్వరలో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో భేటీ కానున్నట్లు, ఇరు దేశాల మధ్య సహకారం బలోపేతం అవుతుందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు.
నిజం ఏమిటి? ట్రంప్ సోషల్ మీడియాలో ఆశాజనకమైన పోస్టులు పెడుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు వేరుగా ఉన్నాయి. శాంతి చర్చల మొదటి దశ విఫలమైన తర్వాత, ట్రంప్ ప్రభుత్వం హోర్ముజ్ జలసంధిలో నావికా దళ దిగ్బంధనాన్ని కఠినతరం చేసింది. చైనా గనుక ఇరాన్‌కు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా మద్దతు ఇస్తే, ఈ సంక్షోభం కేవలం రెండు దేశాలకే పరిమితం కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
