వాషింగ్టన్/టెహ్రాన్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌ను ఆర్థికంగా నామరూపాలు లేకుండా చేసేందుకు ‘మాస్టర్ ప్లాన్’ సిద్ధం చేశారు. ఇన్నాళ్లూ మాటల యుద్ధానికే పరిమితమైన పరిస్థితి, ఇప్పుడు నేరుగా ఇరాన్ ఖజానాకు చిల్లు పెట్టేలా మారుతోంది. హోర్ముజ్ జలసంధి మీదుగా సాగే ఇరాన్ వాణిజ్యాన్ని దిగ్బంధించడం ద్వారా ఆ దేశానికి రోజుకు సుమారు 435 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 4,081 కోట్లు) నష్టం వాటిల్లేలా ట్రంప్ వ్యూహం రచించారు.
‘హోర్ముజ్’ దిగ్బంధం.. ఇరాన్ ఆర్థిక వెన్నుముకపై దెబ్బ!
వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం.. సోమవారం నుండి అమల్లోకి వచ్చిన ఈ నౌకాదళ దిగ్బంధం వల్ల ఇరాన్ నుండి ఎగుమతి అయ్యే ముడి చమురు, ఎరువులు మరియు దిగుమతి చేసుకునే ఆహార పదార్థాల రవాణా పూర్తిగా నిలిచిపోనుంది. ఇరాన్ తన చమురు ఎగుమతుల్లో 90 శాతానికి పైగా ‘ఖర్గ్ ఐలాండ్’ ద్వారానే నిర్వహిస్తుంది. ఇప్పుడు అమెరికా ఆ మార్గాన్ని మూసివేయడంతో ఇరాన్ దిక్కుతోచని స్థితిలో పడిపోయింది.
లెక్కలివే: రోజుకు రూ. 4000 కోట్ల నష్టం ఎలా?
అమెరికా ట్రెజరీ శాఖ మాజీ అధికారి మియాద్ మలేకి విశ్లేషణ ప్రకారం:
- మొత్తం నష్టం: రోజుకు 435 మిలియన్ డాలర్లు.
- చమురు ఎగుమతుల వాటా: ఇందులో 276 మిలియన్ డాలర్లు కేవలం చమురు, పెట్రోకెమికల్స్ ఎగుమతులు ఆగడం వల్ల వచ్చే నష్టం.
- లెక్క: ఇరాన్ రోజుకు 1.5 మిలియన్ బ్యారెళ్ల చమురును ఎగుమతి చేస్తుంది. యుద్ధ సమయంలో ఒక్కో బ్యారెల్ ధర సుమారు 87 డాలర్లుగా లెక్కగడితే ఈ భారీ నష్టం తేలింది.
ట్రంప్ వ్యూహం.. యుద్ధం లేకుండానే లొంగదీసుకోవడం!
ఇస్లామాబాద్‌లో జరిగిన శాంతి చర్చలు విఫలం కావడంతో ట్రంప్ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. నేరుగా సైనిక దాడికి దిగకుండా, ఇరాన్ శక్తి వనరుల ఆదాయాన్ని అడ్డుకోవడం ద్వారా ఆ దేశాన్ని ఆర్థికంగా దివాళా తీయించడమే అమెరికా లక్ష్యం. అయితే, ఈ దిగ్బంధాన్ని అమలు చేయడం అమెరికాకు కూడా కత్తిమీద సామే. ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో అమెరికాకు చెందిన 16 యుద్ధ నౌకలు ఉన్నప్పటికీ, పర్షియన్ గల్ఫ్ లోపల నేరుగా ఏ నౌకా మోహరించలేదు.
ఇరాన్‌కు ఇప్పటికే రూ. 22 లక్షల కోట్ల నష్టం!
ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ ‘అల్-ఆలం’ ప్రకారం.. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల వల్ల ఇరాన్‌కు ఇప్పటివరకు సుమారు 270 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 22.7 లక్షల కోట్లు) నష్టం వాటిల్లింది. ఈ నష్టపరిహారాన్ని అమెరికా ఇవ్వాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. అంతేకాకుండా, యుద్ధ సమయంలో అమెరికా, ఇజ్రాయెల్‌లకు సహకరించిన అరబ్ దేశాలు (సౌదీ, యూఏఈ, ఖతార్, జోర్డాన్) కూడా తమకు నష్టపరిహారం చెల్లించాలని ఇరాన్ ఐక్యరాజ్యసమితిలో ఫిర్యాదు చేసింది.
ప్రపంచ చమురు వాణిజ్యంలో 20 శాతం వాటా కలిగిన హోర్ముజ్ జలసంధిలో ఇప్పుడు అమెరికా విధిస్తున్న ఈ ఆంక్షలు అంతర్జాతీయ మార్కెట్‌ను ఏ తీరానికి చేరుస్తాయో వేచి చూడాలి.
