న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, టర్కీ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. భారత దేశానికి చిరకాల మిత్రదేశమైన సైప్రస్ ఉత్తర భాగంలో టర్కీ తన సైనిక బలాన్ని పెంచింది. సోమవారం నాడు ఉత్తర సైప్రస్ ప్రాంతంలో 6 F-16 ఫైటింగ్ ఫాల్కన్ యుద్ధ విమానాలతో పాటు అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌ను మోహరించినట్లు టర్కీ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
అక్కడ నివసించే టర్కిష్ కమ్యూనిటీ భద్రత కోసమే ఈ చర్య తీసుకున్నట్లు టర్కీ వాదిస్తోంది. అయితే, అంతర్జాతీయంగా గుర్తింపు లేని ‘ఉత్తర సైప్రస్’ ప్రాంతంలో ఈ మోహరింపు జరగడం చర్చనీయాంశమైంది.
ఇరాన్ యుద్ధం – సైప్రస్ ప్రాధాన్యత
ఇరాన్ ఉద్రిక్తతల వల్ల ఈ ప్రాంతం మొత్తం అస్థిరంగా మారింది. గత వారం సైప్రస్‌లోని బ్రిటన్‌కు చెందిన RAF అక్రోటిరి (Akrotiri) ఎయిర్‌బేస్ సమీపంలో ఒక ఇరాన్ డ్రోన్ పడిపోయింది. ఇది లెబనాన్‌కు చెందిన హిజ్బుల్లా ప్రయోగించి ఉండవచ్చని భద్రతా అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటన తర్వాత ఐరోపా దేశాలు కూడా సైప్రస్‌లో తమ సైనిక ఉనికిని పెంచుతున్నాయి. పశ్చిమాసియా యుద్ధం మరింత విస్తరిస్తే, వ్యూహాత్మక ద్వీపమైన సైప్రస్ కూడా ప్రభావితం కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
టర్కీ వర్సెస్ యూరప్
సైప్రస్‌లో ఐరోపా దేశాలు సైన్యాన్ని పెంచడాన్ని టర్కీ తీవ్రంగా విమర్శించింది. ఇది అనవసరంగా యుద్ధాన్ని ద్వీపానికి తీసుకురావడమేనని అంకారా (టర్కీ రాజధాని) పేర్కొంది. మరోవైపు, గత వారం టర్కీ గగనతలంలోకి ప్రవేశించిన ఒక బాలిస్టిక్ క్షిపణిని నాటో (NATO) ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ కూల్చివేసింది. ఆ క్షిపణి ఇరాన్ నుండి వచ్చినట్లు గుర్తించడంతో, తమ గగనతలం వైపు క్షిపణులు పంపవద్దని ఇరాన్‌ను టర్కీ హెచ్చరించింది.
భారత్‌కు ఎందుకు ఆందోళన?
సైప్రస్ అనేది ఐరోపా, మధ్యప్రాచ్యం మరియు ఉత్తర ఆఫ్రికా మధ్య ఉన్న ఒక కీలకమైన భౌగోళిక ప్రాంతం. భారత్‌కు సైప్రస్‌తో దశాబ్దాల కాలంగా బలమైన దౌత్య సంబంధాలు ఉన్నాయి. ఇరాన్ యుద్ధం కారణంగా సైప్రస్ ఒక యుద్ధ క్షేత్రంగా మారితే, అది ఆ ప్రాంతంలో ఉన్న భారత ప్రయోజనాలపై కూడా ప్రభావం చూపుతుంది.
