ఉత్తరప్రదేశ్‌లోని గోండా ప్రాంతంలో ఉన్న ప్రముఖ స్వీట్ షాపులైన ‘శ్రీ నానక్ స్వీట్స్’, ‘గాయత్రీ ఆహార్ స్థల్’లలో దీపావళి పండుగ సందర్భంగా స్వీట్లు కొనుగోలు చేసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు.
దీన్ని ఆసరాగా చేసుకున్న ఒక గుర్తుతెలియని వ్యక్తి, దుకాణాల్లో ఉంచిన అసలైన UPI QR కోడ్‌లను ఎవరికీ అనుమానం రాకుండా తొలగించి, వాటి స్థానంలో తన సొంత QR కోడ్‌ను అతికించి అక్కడి నుంచి ఉడాయించాడు.
దీపావళి రద్దీ సమయంలో స్వీట్లు, ఆహార పదార్థాలు కొనుగోలు చేసిన కస్టమర్లు ఆ ఫేక్ QR కోడ్‌ను స్కాన్ చేసి డిజిటల్ పద్ధతిలో డబ్బులు చెల్లించారు. అయితే ఆ డబ్బులు దుకాణదారుల ఖాతాలోకి కాకుండా మోసగాడి బ్యాంకు ఖాతాలోకి వెళ్లాయి. రోజు చివరలో లెక్కలు చూసుకున్నప్పుడే లక్షల రూపాయల మేర డబ్బులు చేతులు మారిన షాకింగ్ విషయం దుకాణదారులకు తెలిసింది.
ఓ యువకుడు QR కోడ్‌ను మారుస్తున్న సీసీటీవీ/వీడియో దృశ్యాలు ప్రస్తుతం ఎక్స్ (X) ప్లాట్‌ఫామ్‌లో విడుదలై వైరల్‌గా మారాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, వీడియో ఆధారాలతో ఫేక్ క్యూఆర్ కోడ్‌ను అతికించిన వ్యక్తి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.

Leave a Reply