ముంబైలోని పీవీఆర్ (PVR) థియేటర్‌లోకి కెమెరా సౌకర్యం ఉన్న ‘మెటా స్మార్ట్ గ్లాసెస్’ (Meta Smart Glasses) ధరించి వెళ్తున్న ఓ యువకుడిని సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్న ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమైంది.
అక్టోబర్ 30న చోటుచేసుకున్న ఈ ఘటనలో, సినిమా చూసేందుకు వచ్చిన ఆ యువకుడిని ప్రవేశద్వారం వద్దే సిబ్బంది అడ్డుకున్నారు. కెమెరా, రికార్డింగ్ పరికరాలను థియేటర్ లోపలికి తీసుకెళ్లడానికి అనుమతి లేదని వారు స్పష్టం చేశారు.
అయితే, తనకు దృష్టి లోపం ఉన్నందున ఈ పవర్ గ్లాసెస్ (నంబర్ ఉన్న కళ్లజోడు) కచ్చితంగా ధరించాల్సిందేనని ఆ యువకుడు సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు. కావాలంటే తన దగ్గర ఉన్న ఫోన్‌తో కూడా రికార్డ్ చేయవచ్చని, కానీ చూపు కోసం ధరించే ఈ కళ్లజోడును తీసేయమనడం సరికాదని, ఇది పెట్టుకోకపోతే తనకు స్క్రీన్‌పై ఏమీ కనిపించదని అతను వాదించాడు.
అయినా సరే, సినిమా పైరసీని అరికట్టే పీవీఆర్ నిబంధనల ప్రకారం ఇటువంటి స్మార్ట్ గ్లాసెస్‌ను లోపలికి అనుమతించడం పూర్తిగా నిషేధమని సెక్యూరిటీ గార్డు ఖరాఖండిగా తేల్చిచెప్పాడు.
ఈ వ్యవహారంపై స్పందించిన పీవీఆర్ యాజమాన్యం.. కాపీరైట్ మరియు భద్రతా కారణాల దృష్ట్యా రికార్డింగ్ చేయగల ఎలాంటి స్మార్ట్ పరికరాలను థియేటర్‌లోకి అనుమతించబోమని స్పష్టం చేసింది.
ఈ నిబంధనలను పాటించని వారి టిక్కెట్ రద్దు చేయబడుతుందని లేదా ఆ పరికరాన్ని బయటే అప్పగించాల్సి ఉంటుందని యాజమాన్యం పేర్కొంది. ఈ ఘటనకు సంబంధించి సుమారు 2 నిమిషాల నిడివి ఉన్న వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారి పలువురి దృష్టిని ఆకర్షిస్తోంది.

Leave a Reply