చైనాలోని గాన్సు ప్రావిన్స్‌లో ఓ రెస్టారెంట్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. కుటుంబంతో కలిసి భోజనం చేసేందుకు వచ్చిన ఓ దంపతుల మధ్య ఒక్కసారిగా వాగ్వాదం మొదలైంది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన భార్య, తన ఎదురుగా మరిగిపోతున్న వేడి హాట్‌పాట్ పాత్రను భర్తపైకి విసిరేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మొదట్లో ఆ దంపతులు తమ చిన్న కుమార్తెతో కలిసి ఎంతో సంతోషంగా నవ్వుతూ, మాట్లాడుకుంటూ భోజనం చేస్తున్నారు. అయితే కొద్దిసేపటి తర్వాత చిన్నారి సమీపంలోని ఆట స్థలానికి వెళ్లింది. ఆ సమయంలో భార్యాభర్తల మధ్య ఏదో విషయంపై వాగ్వాదం మొదలైంది.
భర్త ఏదో మాట్లాడటంతో భార్య ఒక్కసారిగా తీవ్ర ఆగ్రహానికి గురైంది. మొదట భర్తపైకి పుచ్చకాయ ముక్కను విసిరింది. అయినప్పటికీ ఆమె కోపం తగ్గలేదు. క్షణాల్లోనే పరిస్థితి అదుపుతప్పింది. తన ఎదురుగా ఆవిర్లు కక్కుతున్న వేడివేడి హాట్‌పాట్ పాత్రను చేతిలోకి తీసుకుని భర్తపై బలంగా విసిరేసింది.
అయితే భర్త తృటిలో ఆ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. కానీ ఆ పాత్రలోని వేడివేడి సూప్ పక్కనే ఉన్న మరో కస్టమర్‌పై పడినట్లు సమాచారం. ఇదంతా కళ్లముందే జరుగుతుండటంతో అక్కడున్నవారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
అన్నింటికంటే బాధాకరమైన విషయం ఏమిటంటే.. తల్లిదండ్రుల మధ్య జరుగుతున్న ఈ భయంకరమైన గొడవను చూసిన చిన్నారి కన్నీళ్లు పెట్టుకుంది. తల్లిదండ్రులు ఇలా కొట్టుకోవడం చూసి ఆ పాప పడిన బాధ నెటిజన్లను కలచివేస్తోంది.
ఈ వీడియోపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కోపాన్ని అదుపులో పెట్టుకోలేక బహిరంగ ప్రదేశాల్లో ఇలాంటి హింసాత్మక చర్యలకు పాల్పడటం ఎంతమాత్రం సమర్థనీయం కాదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
భార్యాభర్తల మధ్య గొడవలు సహజమే అయినప్పటికీ, వాటిని హింసాత్మకంగా మార్చడం వల్ల కుటుంబ సభ్యులతో పాటు ముఖ్యంగా చిన్నపిల్లల మనసులపై తీవ్ర ప్రభావం పడుతుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply