అమెరికాలో జరిగిన ఒక బేస్‌బాల్ మ్యాచ్ సందర్భంగా, ఒక తల్లి ఒక చేతిలో పసిపాపను పట్టుకుని, మరో చేతిలో 3 ప్లేట్ల ఆహారాన్ని మోసుకొస్తున్న వీడియో ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతోంది.
శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన ఈ మ్యాచ్ సమయంలో, ఆ మహిళ తన బిడ్డను ఒడికి హత్తుకుని ఎంతో శ్రమతో ఆహారాన్ని తీసుకుంటూ తన సీటు వద్దకు వస్తుంది. అయితే, ఆమె పక్కనే ఉన్న వ్యక్తి ఆమెకు ఎలాంటి సహాయం చేయకుండా కేవలం వేడుక చూస్తూ ఉండిపోయాడు.
ఈ దృశ్యాన్ని చూసిన మ్యాచ్ ప్రత్యక్ష వ్యాఖ్యాతలు (కామెంటేటర్లు), ‘ఈమె నిజమైన మల్టీటాస్కింగ్ తల్లి’ అని, ‘ఈ ఏటి ఉత్తమ తల్లి’ (మదర్ ఆఫ్ ది ఇయర్) అని కొనియాడారు. అంతేకాకుండా, ఆమె అందరికంటే చివరలోనే తింటుందని సానుభూతి వ్యక్తం చేశారు.
ఈ వీడియో ఎక్స్ (ట్విట్టర్) వేదికగా షేర్ అవ్వగా లక్షలాది మంది వీక్షించారు. ఇది చూసిన మెజారిటీ నెటిజన్లు.. భార్యకు, బిడ్డకు ఎలాంటి సాయం చేయకుండా ప్రశాంతంగా తింటున్న ఆ వ్యక్తిని ‘బాధ్యతారాహిత్యమైన భర్త’ అని ఘాటుగా విమర్శిస్తున్నారు.
అయినప్పటికీ కొందరు మాత్రం, ‘పూర్తి నిజం తెలియకుండా ఎవరినీ తప్పుబట్టకూడదు; బహుశా ఆ మహిళ పాపకు బట్టలు మార్చడానికి వెళ్లి వచ్చేటప్పుడు ఈ ఆహారాన్ని తీసుకుని వచ్చి ఉండవచ్చు’ అని ఆ వ్యక్తికి మద్దతుగా కామెంట్లు చేస్తున్నారు.

Leave a Reply