ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఆగ్రాలో మానసిక రుగ్మత కారణంగా ఒక వ్యక్తి తన మలద్వారంలోకి (Anus) లీటర్ వాటర్ బాటిల్‌ను దూర్చిన ఘటన తీవ్ర కలకలం రేపింది. సుమారు 36 గంటల పాటు ప్రాణాపాయ స్థితిలో ఉన్న అతడిని వైద్యులు శస్త్రచికిత్స చేసి కాపాడారు.
అసలేం జరిగింది? ఆగ్రాలోని షాగంజ్ ప్రాంతానికి చెందిన 38 ఏళ్ల వ్యక్తి గత కొన్ని రోజుల క్రితం తీవ్రమైన కడుపునొప్పితో ఆసుపత్రికి వచ్చాడు. ఎక్స్-రే తీసి చూసిన వైద్యులు షాక్‌కు గురయ్యారు. అతని మలనాళం (Rectum) భాగంలో ఒక లీటర్ ప్లాస్టిక్ వాటర్ బాటిల్ చిక్కుకుపోయి ఉన్నట్లు గుర్తించారు.
వ్యాధి వివరాలు: దర్యాప్తులో ఆ వ్యక్తి ‘ఆనల్ ఎరోటిసిజం’ (Anal Eroticism) అనే ఒక రకమైన మానసిక రుగ్మతతో బాధపడుతున్నట్లు తేలింది. ఈ రుగ్మత ఉన్నవారు మలద్వారంలో వస్తువులను ఉంచుకోవడం ద్వారా వింతైన ఆనందం పొందాలని ప్రయత్నిస్తారు. ఈ క్రమంలోనే ఆ వ్యక్తి వాటర్ బాటిల్‌ను లోపలికి దూర్చాడు. కానీ అది బయటకు రాకుండా లోపలే చిక్కుకుపోయింది.
36 గంటల పాటు బాటిల్ లోపలే ఉండటంతో మలవిసర్జన చేయలేక, తీవ్రమైన నొప్పితో అతను విలవిలలాడాడు. పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి చేరాడు. సీనియర్ సర్జన్ డాక్టర్ సునీల్ శర్మ నేతృత్వంలోని బృందం సుమారు ఒక గంటా 10 నిమిషాలు శ్రమించి ఆ బాటిల్‌ను బయటకు తీశారు.
డాక్టర్ హెచ్చరిక: డాక్టర్ శర్మ మాట్లాడుతూ.. “ఇది ఒక రకమైన ‘సైకో-సెక్సువల్ డిజార్డర్’ (Psycho-sexual disorder). బాటిల్ వల్ల మలనాళం తీవ్రంగా గాయపడింది. బాటిల్‌ను తొలగించిన తర్వాత నాలుగు రోజుల పాటు అతడిని పర్యవేక్షణలో ఉంచాం. ప్రస్తుతం అతను కోలుకుని ఇంటికి వెళ్లాడు” అని తెలిపారు. వివాహితుడైన ఆ వ్యక్తికి ఇలాంటి అలవాట్ల వల్ల హెచ్‌ఐవీ (HIV), హెపటైటిస్ వంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని, వీరికి శస్త్రచికిత్స కంటే మానసిక కౌన్సెలింగ్ చాలా అవసరమని వైద్యులు సూచించారు.
