సోషల్ మీడియాలో ‘కూల్’గా కనిపించడం కోసం ఏదైనా చేయొచ్చు అని అనుకునే వారికి ఈ వీడియో ఒక గుణపాఠం. కేరళకు చెందిన కంటెంట్ క్రియేటర్ ముబారక్, నాగాలాండ్ పర్యటనకు వెళ్ళినప్పుడు చేసిన పని ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
అసలేం జరిగిందంటే: ప్రపంచంలోనే అత్యంత కారమైన మిరపకాయలలో ఒకటిగా పేరుగాంచిన ‘భూత్ జోలోకియా’ (Bhut Jolokia) ను చూసిన ముబారక్, “ఇది మనకేం చేస్తుందిలే” అన్నట్టుగా కెమెరా ఆన్ చేయమని చెప్పి, ఆ మిరపకాయను అలాగే కొరికి తినేశాడు.
మొదట స్టైల్‌గా నవ్వుతూ బిల్డప్ ఇచ్చిన ముబారక్‌కు, మరుసటి క్షణమే కారం రుచి చూపించింది. కళ్లు ఎర్రబడి, కన్నీళ్లు ధారలుగా కారడం మొదలయ్యాయి. గొంతులో, చెవుల్లో మంట పుట్టడంతో అతను తట్టుకోలేక అరిచాడు. కారం తట్టుకోలేక పక్కనే ఉన్న దుకాణాలకు పరుగెత్తి చాక్లెట్లు, ఐస్‌క్రీమ్‌లు, కూల్ డ్రింక్స్.. ఇలా కంటికి కనిపించినవన్నీ తినేసి ఎలాగోలా ప్రాణాలు కాపాడుకున్నాడు.
“పొరపాటున కూడా ఎవరూ ఈ పని చేయకండి బాబోయ్” అంటూ అతను చివర్లో ఏడుస్తూ చెప్పిన ఈ వీడియో ప్రస్తుతం 1 కోటికి పైగా వ్యూస్‌తో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
