“ఇవన్నీ తీవ్రమైన మానసిక వేధింపుల కిందకే వస్తాయి!”.. భార్య మితిమీరిన ఒత్తిడితో దూరమైన భర్త.. మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు..!!!

తల్లిదండ్రులను వదిలేసి తనతో వేరుకాపురం రావాలంటూ భర్తపై భార్య ఒత్తిడి తీసుకురావడం తీవ్రమైన మానసిక వేధింపుల కిందకే వస్తుందని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది.

ఫ్యామిలీ కోర్టు మంజూరు చేసిన విడాకుల తీర్పును సవాలు చేస్తూ భార్య దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం.. దానిని కొట్టివేస్తూ ఈ కీలక వ్యాఖ్యలు చేసింది.

కుటుంబంలో ఏకైక కుమారుడైన భర్త.. తన సొంత ఇంట్లో తల్లిదండ్రులతో కలిసి నివసిస్తున్నాడనే విషయం పూర్తిగా తెలిసే పెళ్లి చేసుకున్న సదరు మహిళ, ప్రతి చిన్న విషయానికీ పుట్టింటికి వెళ్లిపోవడాన్ని అలవాటుగా మార్చుకుంది. సరైన కారణం లేకుండా భార్య పదేపదే ఇంటిని వదిలి వెళ్లడం భర్త మనస్సులో.. ఆమె ఎక్కడ తనను శాశ్వతంగా వదిలి వెళ్లిపోతుందోననే అనవసర భయాన్ని, అభద్రతాభావాన్ని కలిగిస్తుందని న్యాయస్థానం తన తీర్పులో ఎత్తిచూపింది.

దాంపత్య జీవితం అనేది పరస్పర అవగాహన, సర్దుకుపోయే తత్వంపై ఆధారపడి నిర్మితమవ్వాలి తప్ప.. ఒకరి కఠినమైన ఆదేశాలకు మరొకరు బానిసలా తలొగ్గేలా ఉండకూడదని న్యాయమూర్తులు స్పష్టం చేశారు. పెళ్లికి ముందే భర్తకు తల్లిదండ్రుల పట్ల ఉన్న బాధ్యతల గురించి తెలిసినప్పటికీ, పెళ్లయ్యాక వారిని ఒంటరిగా వదిలేయాలని బలవంతం చేయడం చట్టప్రకారం చెల్లదంటూ వెలువడిన ఈ తీర్పు.. ప్రస్తుత కుటుంబ వివాదాల చట్టపరమైన అంశాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.


Posted

in

by

Tags: