అమెరికాలోని మిస్సోరి (Missouri) రాష్ట్రంలో నెల రోజుల పసికందును ఓవెన్లో పెట్టి ప్రాణాలు తీసిన ఘటనలో, చిన్నారి తల్లికి కోర్టు 13 ఏళ్ల జైలు శిక్ష విధించింది.
28 ఏళ్ల మరియా థామస్, 2024 ఫిబ్రవరి 9న తన బిడ్డను నిద్రపుచ్చాలనుకుందని, అయితే పొరపాటున ఉయ్యాలకు బదులుగా ఓవెన్లో పెట్టినట్లు తన కుటుంబ సభ్యులకు చెప్పినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
కాన్సాస్ సిటీలోని (Kansas City) ఓ ఇంట్లో చిన్నారి ప్రాణాపాయ స్థితిలో ఉందన్న సమాచారంతో పోలీసులు, సహాయక బృందాలు అక్కడికి చేరుకున్నారు. అప్పటికే కేవలం నెల రోజుల వయసున్న జారియా (Za’Riah) అనే ఆ పసికందు తీవ్ర కాలిన గాయాలతో విగతజీవిగా పడి ఉంది. చిన్నారి వేసుకున్న దుస్తులలో కొన్ని భాగాలు కరిగిపోయాయని, ఇంట్లో కాలిపోయిన బేబీ బ్లాంకెట్‌ను (దుప్పటిని) కూడా గుర్తించినట్లు దర్యాప్తు నివేదికలో పేర్కొన్నారు.
ఈ ఘటనపై మొదట చిన్నారి ప్రాణాలకు ముప్పు కలిగించారనే అభియోగంతో కేసు నమోదు చేశారు. ఆ తర్వాత మరియా థామస్‌పై ‘ఫస్ట్-డిగ్రీ మర్డర్’ (ఉద్దేశపూర్వక హత్య) అభియోగాన్ని కూడా చేర్చారు. కానీ, ఆమె కోర్టులో తన నేరాన్ని అంగీకరించడంతో ఆ ఫస్ట్-డిగ్రీ మర్డర్ అభియోగాన్ని ఉపసంహరించారు. సెప్టెంబర్ 22న జరిగిన విచారణలో, చిన్నారి మరణానికి కారణమైన ‘ఫస్ట్-డిగ్రీ ఎండేంజర్మెంట్ ఆఫ్ ఏ చైల్డ్’ (పసికందు ప్రాణాలకు తీవ్ర హాని కలిగించడం) నేరాన్ని ఆమె అంగీకరించింది.
దీంతో జాక్సన్ కౌంటీ కోర్టు న్యాయమూర్తి సారా ఏ. క్యాసిల్ (Sarah A. Castle), మరియా థామస్‌కు 13 ఏళ్ల జైలు శిక్ష విధించారు. ఆమె పెరోల్ లేకుండానే ఈ శిక్షను అనుభవించాల్సి ఉంటుంది, అయితే ఆమె ఇప్పటికే జైలులో గడిపిన కాలాన్ని కూడా ఈ శిక్షా కాలంలో మినహాయిస్తారు. అంతేకాకుండా, స్టేట్ క్రైమ్ విక్టిమ్స్ కాంపెన్సేషన్ ఫండ్‌కు 68 అమెరికన్ డాలర్లు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఈ ఘటనకు సంబంధించిన కోర్టు విచారణ ప్రక్రియలు ప్రస్తుతం ముగిశాయి.

Leave a Reply