“ఈమె నా ప్రియురాలు!”: లోపలికి వెళ్లిన న్యాయమూర్తి.. తలుపు తీయగానే షాకింగ్ ట్విస్ట్.. ఆసుపత్రినే లగ్జరీ రిసార్ట్‌గా మార్చేసిన ప్రభుత్వ అధికారి.!!

కర్ణాటకలోని శ్రీరంగపట్నంలో సర్వే విభాగం (ల్యాండ్ రికార్డ్స్) అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన మహమ్మద్ హుస్సేన్ అనే అధికారిని.. అవినీతి, అక్రమాస్తుల కేసులో లోకాయుక్త పోలీసులు అరెస్ట్ చేశారు.

అయితే, రిమాండ్‌లో ఉన్న నిందితుడిని జైలులో ఉంచకుండా, మండ్యలోని ప్రభుత్వ వైద్య విజ్ఞాన సంస్థ (MIMS) ఆసుపత్రిలోని ఒక ప్రత్యేక గదిలో (స్పెషల్ రూమ్) చేర్పించారు. ఎలాంటి తీవ్రమైన అనారోగ్య కారణాలు లేకుండానే ఒక విచారణ ఖైదీ జైలుకు బదులుగా ఆసుపత్రిలో ప్రత్యేక సౌకర్యాలు పొందుతూ ఉండటం తీవ్ర దుమారానికి దారితీసింది.

మండ్య జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి. చంద్రశేఖర్ ఆసుపత్రిలో నిర్వహించిన ఆకస్మిక తనిఖీలతో ఈ బాగోతం బట్టబయలైంది. ఆసుపత్రిలో తనిఖీలు చేపట్టిన న్యాయమూర్తికి.. హుస్సేన్‌కు ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించాల్సినంత పెద్ద ఆరోగ్య సమస్యలేవీ లేవని అక్కడి వైద్యులు స్పష్టం చేశారు. అనంతరం హుస్సేన్ బస చేసిన ప్రత్యేక గది తలుపులు తెరిచి పరిశీలించగా.. అక్కడ అతనితో పాటు ఒక యువతి ఉన్నట్లు తేలింది. ఆమె ఎవరో కాదని, హుస్సేన్ ప్రియురాలని తేలడంతో అధికారులు నివ్వెరపోయారు. తగిన పోలీస్ బందోబస్తు కూడా లేకుండా ఒక ఖైదీ తన ప్రియురాలితో కలిసి ఏకాంతంగా ఆసుపత్రి గదిలో ఉండటం న్యాయమూర్తిని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

కోర్టు ముందస్తు అనుమతి లేకుండా, కనీస సమాచారం కూడా ఇవ్వకుండా కేవలం జైలు డాక్టర్ సిఫార్సు ఆధారంగానే హుస్సేన్‌ను ఆసుపత్రికి తరలించినట్లు జైలు అధికారులు న్యాయమూర్తి ఎదుట అంగీకరించారు. జైలు, ఆసుపత్రి వర్గాల బాధ్యతారాహిత్యం, తీవ్ర నిబంధనల ఉల్లంఘనపై న్యాయమూర్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ ప్రాతిపదికన అతడిని ఆసుపత్రికి తరలించారు? అక్కడ భద్రతా లోపాలకు ఎవరు బాధ్యులు? అనే అంశాలపై పూర్తిస్థాయి సమగ్ర నివేదిక సమర్పించాలని ఇరు శాఖల అధికారులను ఆదేశించారు. అధికారుల అండదండలతో ఖైదీలు ఆసుపత్రులను లగ్జరీ రిసార్టులుగా మార్చుకుంటున్న ఈ ఉదంతంపై ప్రస్తుతం ఉన్నత స్థాయి దర్యాప్తు జరుగుతోంది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *