ఉత్తరాఖండ్‌లోని నైనితాల్ సరస్సు ఒడ్డున మ్యాజిక్ ప్రదర్శన చేస్తున్న ఒక చిన్నారి అసాధారణ ప్రతిభ నెటిజన్లను కట్టిపడేస్తోంది. ఈ వీడియో ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా దృష్టికి వెళ్లడంతో, ఆయన ఆ బాలుడికి సహాయం చేయడానికి ముందుకు వచ్చారు.
ఆనంద్ మహీంద్రా ఏమన్నారంటే? మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా, ఒక నిమిషం 39 సెకన్ల నిడివి గల ఆ వీడియోను తన ‘ఎక్స్’ (X) ఖాతాలో షేర్ చేస్తూ ఇలా రాశారు: “ఈ అబ్బాయిలో అద్భుతమైన ప్రతిభ ఉంది. ఇతను నైనితాల్ వీధుల్లోనే ఉండిపోవాలా? ఇతని చదువుకు సహాయం చేయడమే కాకుండా, మ్యాజిక్ పట్ల ఉన్న ఇతని ఆసక్తిని ప్రోత్సహించి, ప్రపంచ స్థాయి మ్యాజీషియన్గా మార్చాలని ఉంది. ఆ అబ్బాయిని, అతని తల్లిదండ్రులను సంప్రదించడానికి ఎవరైనా సహాయం చేస్తారా?” అని కోరారు.
ఎవరీ బాలుడు? వీడియోలో సదరు బాలుడు తన పేరు ‘సాహిల్’ అని చెబుతున్నాడు. సరస్సు ఒడ్డున కాయిన్ మ్యాజిక్ ట్రిక్స్ చూపిస్తూ పర్యాటకులను ఆకట్టుకుంటున్నాడు. ఈ బాలుడు ఉత్తరాఖండ్‌లోని రుద్రపూర్‌కు చెందినవాడని, కొన్ని రోజుల క్రితమే నైనితాల్ వచ్చాడని తెలుస్తోంది. ఎవరో పర్యాటకుడు తీసిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.
ప్రజల స్పందన: ఆనంద్ మహీంద్రా చేసిన ఈ పోస్ట్‌కు వేల సంఖ్యలో లైకులు, రీట్వీట్లు వస్తున్నాయి. అయితే, ఒక నెటిజన్ స్పందిస్తూ, “సార్, ఇలాంటి ప్రతిభ కలిగిన బాలురు వేలల్లో ఉన్నారు. మీరు నిజంగా మార్పు తేవాలనుకుంటే అందరికీ సహాయం చేయండి, అది మీకు పెద్ద కష్టమేమీ కాదు కదా!” అని వ్యాఖ్యానించారు. వందలాది మంది ప్రజలు ఈ బాలుడి భవిష్యత్తు కోసం ఆనంద్ మహీంద్రా తీసుకున్న నిర్ణయాన్ని ప్రశంసిస్తున్నారు.
