మధ్యప్రదేశ్ రాష్ట్రం సియోనీ జిల్లాలోని ఒక ప్రైవేట్ హోటల్‌లో బస చేసిన ఓ జంటను, గంజాయి కేసులో ఇరికిస్తానని ఓ ఉన్నత పోలీసు అధికారి బెదిరించిన ఘటన సీసీటీవీ దృశ్యాల ద్వారా బట్టబయలై తీవ్ర కలకలం రేపుతోంది.
గత నవంబర్ 13న సియోనీ జిల్లాలోని ఓ హోటల్‌లో వివాహం కాని ఓ యువ జంట బస చేసింది. అప్పుడు అక్కడికి తనిఖీల పేరుతో వచ్చిన అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ASP) దీపక్ మిశ్రా, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP) సంజలేష్ మార్కమ్, పోలీస్ ఇన్‌స్పెక్టర్ సతీష్ తివారీలతో కూడిన పోలీసు బృందం ఆ జంటను విచారించింది.
విచారణలో.. తామిద్దరం మేజర్లమని, ఒకే సామాజిక వర్గానికి చెందినవారమని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నామని ఆ జంట పోలీసులకు వివరించారు. కానీ దానిని అంగీకరించని అధికారులు, వెంటనే వారి తల్లిదండ్రులకు ఫోన్ చేసి మాట్లాడాలని బలవంతం చేశారు. ముఖ్యంగా ఆ యువతి తన సెల్‌ఫోన్ లాక్ తీసి ఇంటికి ఫోన్ చేసేందుకు నిరాకరించింది.
దీంతో ఆగ్రహించిన ఏఎస్‌పీ దీపక్ మిశ్రా, అక్కడున్న హోటల్ సిబ్బందిని పిలిచి.. ఆ యువకుడి బ్యాగ్‌లో గంజాయి పెట్టాలని ఆదేశించాడు. అంతేకాకుండా, తల్లిదండ్రుల గురించి ఏమాత్రం పట్టించుకోకుండా ఇక్కడికి వచ్చి విలాసంగా గడుపుతున్నారా అంటూ ఆ జంటను తీవ్రంగా మందలించాడు.
అధికారి చేసిన ఈ దురుసు ప్రవర్తన, బెదిరింపు దృశ్యాలన్నీ అక్కడున్న సీసీటీవీ కెమెరాలో స్పష్టంగా రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి, పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. అయితే, ఈ వ్యవహారంలో సంబంధిత పోలీసు అధికారులపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకున్నట్లు సమాచారం లేదు.

Leave a Reply