ఆరోగ్య సూత్రాలు: బరువు తగ్గాలనుకునే వారికి పీచ్ పండు (Peach Fruit) ఒక అద్భుతమైన ఎంపిక అని నిపుణులు చెబుతున్నారు. పీచ్ పండ్లలో కేలరీలు తక్కువగా ఉండటం వల్ల బరువు నియంత్రణలో ఇది ఎంతగానో సహాయపడుతుంది. ఇందులో పోషకాలు సమృద్ధిగా ఉండటమే కాకుండా, పీచు పదార్థం (ఫైబర్) కూడా అధికంగా ఉంటుంది.
ఇది ప్రేగుల ఆరోగ్యానికి చాలా మంచిది. పీచ్ పండ్లలో విటమిన్లు, ఖనిజాలు మరియు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ పండు కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు అంటున్నారు. ఇందులో ఉండే విటమిన్-ఎ మరియు బీటా-కెరోటిన్ కంటి చూపును మెరుగుపరచడమే కాకుండా, క్యాటరాక్ట్ (కంటి పొర) సమస్యలను నివారిస్తుంది.
క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాటం
పీచ్ పండ్లు క్యాన్సర్ కణాల పెరుగుదలను, ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్‌ను అరికట్టడంలో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. మెనోపాజ్ (ముట్లు ఉడిగిన) దశలో ఉన్న మహిళలు రోజుకు కనీసం రెండు పీచ్ పండ్లు తినాలని వైద్యులు సిఫార్సు చేస్తున్నారు. అంతేకాకుండా, పీచ్‌లలో ఉండే పాలిఫెనాల్స్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ మరియు యాంటీ ఆక్సిడెంట్ గుణాలు శరీరంలోని నొప్పులను తగ్గిస్తాయి.
జీర్ణక్రియ మరియు గుండె ఆరోగ్యం
పీచ్‌లలో ఉండే అధిక ఫైబర్ కంటెంట్ ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరిచి, అతిసారం (డయేరియా) మరియు మలబద్ధకం వంటి సమస్యలను నివారిస్తుంది. ఇది ప్రేగుల కదలికలను (Bowel movements) ఆరోగ్యంగా ఉంచుతుంది.
అంతేకాకుండా, పీచ్ పండ్లు రక్తపోటు (BP) మరియు అధిక కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. తద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని నివారిస్తాయి. ఇవి రక్తంలో హిస్టామైన్ ఉత్పత్తిని అడ్డుకుని అలర్జీ లక్షణాలను కూడా తగ్గిస్తాయి.
చర్మ సౌందర్యం కోసం..
పీచ్ పండ్లు మీ సౌందర్యాన్ని రెట్టింపు చేయగలవు. ఈ పండులో విటమిన్-ఎ మరియు సి సమృద్ధిగా ఉంటాయి. వీటితో ఫేషియల్ చేసుకోవడం వల్ల చర్మంపై ముడతలు తొలగిపోతాయి. చర్మ రంధ్రాల్లోని మలినాలను తొలగించి, ముఖాన్ని శుభ్రంగా మరియు కాంతివంతంగా మార్చడంలో పీచ్ ఎంతగానో తోడ్పడుతుంది.
