అకోలాకు చెందిన హేమంత్ ప్రఫుల్ సప్కల్ అనే యువకుడిని, డబ్బుల వర్షం కురవడానికి నిర్వహించిన అఘోరీ పూజలో నరబలి ఇచ్చారంటూ అతని కుటుంబ సభ్యులు సంచలన ఆరోపణలు చేశారు.
గత నవంబర్ 12 రాత్రి, అకోలాలోని మోతీ ఉమ్రీ ప్రాంతానికి చెందిన వివేక్ అలియాస్ విక్కీ షిండే, అజయ్ గైక్వాడ్, మరో వ్యక్తితో కలిసి అమరావతికి వెళ్తున్నానని చెప్పి హేమంత్ ఇంటి నుంచి బయలుదేరాడు. నవంబర్ 15 మధ్యాహ్నం వరకు కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడుతూనే ఉన్నాడు. మరుసటి రోజు ఇంటికి తిరిగి వస్తానని చెప్పాడు.
అయితే, నవంబర్ 15 సాయంత్రం తన సోదరుడికి ఫోన్ చేసిన హేమంత్, తాను ఇండోర్‌లో ఉన్నానని, తనతో పాటు వచ్చిన వారు ఈ రాత్రి తనను చంపేస్తారని, ఎలాగైనా కాపాడాలని కన్నీరుమున్నీరుగా విలపిస్తూ సాయం కోరాడు. అంతేకాకుండా, వివేక్ అలియాస్ విక్కీ షిండే తనను పదేపదే పిలుస్తున్నాడని చెప్పిన కొద్ది నిమిషాల్లోనే ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో సంబంధం తెగిపోయింది.
దీంతో తీవ్ర ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు అర్ధరాత్రి 12 గంటల సమయంలో విక్కీ షిండేకు ఫోన్ చేసి ఆరా తీయగా, తాను రైలులో ఉన్నానని, హేమంత్ వెనుక బోగీలో వస్తున్నాడని బదులిచ్చాడు. కానీ, మరుసటి రోజు నవంబర్ 16 ఉదయం 11 గంటల సమయంలో హేమంత్ ఫోన్‌కు కాల్ చేయగా, అవతలి వైపు నుంచి మాట్లాడిన ఇండోర్ ఎంజీ రోడ్ పోలీసులు హేమంత్ మృతి చెందాడన్న షాకింగ్ వార్తను తెలిపారు.
కొన్ని గంటల క్రితమే ప్రాణభిక్ష పెట్టమని వేడుకున్న కొడుకు శవమై కనిపించడంతో సప్కల్ కుటుంబం కుప్పకూలిపోయింది. మాంత్రికుడు విక్కీ షిండే మాటలు విని, డబ్బుల వర్షం కురిపించే అఘోరీ పూజ కోసం తమ కొడుకును ఇండోర్‌కు తీసుకెళ్లి బలిచ్చారని వారు ఆరోపిస్తున్నారు.
ఈ ఘటనపై అకోలాలోని సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్‌లో హేమంత్ సోదరుడు ఫిర్యాదు చేయగా, ఇండోర్ ఎంజీ రోడ్ పోలీసులు కూడా లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యులు చేసిన ఈ నరబలి ఆరోపణలపై పోలీసుల పూర్తి స్థాయి విచారణ తర్వాతే అసలు నిజం బయటపడనుండటంతో ఈ ప్రాంతంలో తీవ్ర కలకలం నెలకొంది.

Leave a Reply