హాంగ్‌కాంగ్‌లోని ఒక హోటల్లో జరిగిన ఈ సంఘటన, ప్రస్తుతం సోషల్ మీడియాలో పలువురి ప్రశంసలను అందుకుంటోంది. అక్కడ ఆహారం తింటున్న ఒక చిన్న బాలుడిని, తోటి విద్యార్థుల ముఠా ఒకటి చుట్టుముట్టి తీవ్రంగా గేలి చేస్తూ వేధించింది. దీంతో ఆ బాలుడు భయంతో ఏం చేయాలో తెలియక తలదించుకుని నిలబడ్డాడు.
అక్కడున్న ఇతర కస్టమర్లు ఇదంతా చూస్తున్నా పట్టించుకోకుండా వెళ్లిపోగా, ఒక వృద్ధుడు హఠాత్తుగా అక్కడికి వచ్చాడు. బాలుడిని చుట్టుముట్టి బెదిరిస్తున్న ఆ విద్యార్థుల ముఠాను ఆయన ధైర్యంగా ఎదుర్కొని, వారిని అడ్డుకుంటూ ఆవేశంతో మండిపడ్డాడు. ఒక దశలో సహనం కోల్పోయిన ఆయన, వేధింపులకు గురిచేస్తున్న ఆ ముఠాను కొట్టి తరిమేయడమే కాకుండా, ఆ బాలుడిని రక్షించాడు.
వృద్ధుడి ఈ వీరోచిత చర్య అక్కడున్న వారిని ఆశ్చర్యపరిచింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్ అవుతుండటంతో, “ఈ వయసులోనూ ఇంత ధైర్యమా?”, “ఆ పెద్దాయన సరైన గుణపాఠం చెప్పారు” అంటూ నెటిజన్లు ఆ వృద్ధుడిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
