రోజువారీ పని ఒత్తిడి, అలసట వల్ల వచ్చే సాధారణ శరీర నొప్పులకు మనం తరచుగా పెయిన్ కిల్లర్ మాత్రలు లేదా ఆయింట్మెంట్లు వాడి ఊరుకుంటాం. అయితే, మందులు వేసుకున్నా, విశ్రాంతి తీసుకున్నా కొన్ని నొప్పులు తగ్గకుండా నిరంతరం వేధిస్తుంటే, అది సాధారణ అలసట కాదని, క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల ప్రారంభ హెచ్చరిక కావచ్చునని వైద్యులు చెబుతున్నారు.
ముఖ్యంగా, విశ్రాంతి తీసుకున్నా తగ్గని దీర్ఘకాలిక వెన్నునొప్పి, రాత్రిపూట నొప్పి తీవ్రతరం కావడం, బరువు తగ్గడం వంటివి క్లోమ (పాంక్రియాటిక్), ఊపిరితిత్తుల లేదా రొమ్ము క్యాన్సర్ లక్షణాలు కావచ్చు. అలాగే, సాధారణ గ్యాస్ సమస్య అనుకునే కడుపునొప్పి తగ్గకుండా పెరగడంతో పాటు, మలంలో రక్తం పడటం లేదా మలవిసర్జన అలవాట్లలో మార్పులు కనిపిస్తే, అది కాలేయ (లివర్) లేదా పెద్దపేగు క్యాన్సర్కు సంకేతం అయ్యే అవకాశం ఉంది.
గతంలో ఎన్నడూ లేని విధంగా అకస్మాత్తుగా వచ్చి, మందులకు తగ్గని తీవ్రమైన తలనొప్పితో పాటు జ్ఞాపకశక్తి తగ్గడం, కంటి చూపులో సమస్యలు తలెత్తితే అది బ్రెయిన్ ట్యూమర్ (మెదడులో కణితి) లక్షణం కావచ్చు. అంతేకాకుండా, విశ్రాంతి తీసుకున్నా ఒకే చోట నిరంతరం వేధించే కీళ్ల నొప్పి, తరచుగా జ్వరం వస్తుంటే అది ఎముకల క్యాన్సర్ లేదా లుకేమియా వంటి సమస్యలకు సంకేతం కావచ్చు.
గుండెకు సంబంధించిన పరీక్షలన్నీ సాధారణంగానే ఉన్నప్పటికీ ఛాతీ నొప్పి కొనసాగుతూ, దానితో పాటు దగ్గు, శ్వాస ఆడకపోవడం లేదా గొంతులో మార్పు కనిపిస్తే అది ఊపిరితిత్తుల క్యాన్సర్ లక్షణం కావచ్చు. సాధారణ చికిత్సలకు తగ్గకుండా రోజురోజుకూ తీవ్రమయ్యే ఎలాంటి నొప్పినైనా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించడం అవసరమని ఢిల్లీ ఎయిమ్స్ (AIIMS) వైద్యులు సూచిస్తున్నారు.
క్యాన్సర్ విషయంలో ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స తీసుకోవడమే అత్యుత్తమ రక్షణ. కాబట్టి, పైన పేర్కొన్న ఈ ఐదు చోట్ల నిరంతరం నొప్పి వస్తుంటే సాధారణంగా తీసుకుని వదిలేయకుండా, తగిన వైద్య సలహా, పరీక్షలు చేయించుకోవడం మంచిది.

Leave a Reply