“ఉచితంగా సంబంధాలు చూస్తాం”. 30 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వరకు పెళ్లి కాక ఇబ్బంది పడుతున్న పురుషులు. కన్నీళ్లతో వచ్చిన తల్లిదండ్రులు. 7,000 మంది తరలిరావడంతో తీవ్ర కలకలం.!!!

కేరళ రాష్ట్రం కోజికోడ్ సమీపంలోని కరందూర్ హరహర మహాదేవ ఆలయంలో నిర్వహించిన ఉచిత వివాహ రిజిస్ట్రేషన్ శిబిరంలో ఊహించని విధంగా సుమారు 7,000 మంది పాల్గొన్నారు.

నవంబర్ 1న జరిగిన ఈ శిబిరానికి రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి పెళ్లి సంబంధాలు వెతుకుతున్న వేలాది మంది తరలిరావడంతో, జాతీయ రహదారిపై ఉన్న రెండు బస్టాపులను దాటి భారీ క్యూ నెలకొంది. దీంతో ఆ ప్రాంతంలో ఏర్పడిన తీవ్ర ట్రాఫిక్ జామ్‌ను పోలీసులు జోక్యం చేసుకుని క్రమబద్ధీకరించారు.

ఆలయ నిర్వాహకులు 1,500 నుంచి 2,000 మంది మాత్రమే వస్తారని ఆశించి కేవలం 1,500 దరఖాస్తు ఫారాలను మాత్రమే సిద్ధం చేసి ఉంచారు. కానీ, ఉదయం 7 గంటలకే వేలాది మంది చేరుకోవడంతో కొన్ని గంటల్లోనే ఫారాలు అయిపోయాయి. దీంతో హుటాహుటిన ప్రింటింగ్ ప్రెస్‌ను సంప్రదించి మరో 4,000 ఫారాలను ముద్రించి పంపిణీ చేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరగాల్సిన ఈ శిబిరం, జనం రద్దీ కారణంగా రాత్రి వరకు కొనసాగింది.

ఈ శిబిరంలో నమోదు చేసుకున్న వారిలో సుమారు 80 శాతం మంది 30 నుంచి 50 ఏళ్ల లోపు పురుషులే కావడం గమనార్హం. ఏళ్లుగా సంబంధాలు కుదరక ఇబ్బంది పడుతున్న పలువురికి ఈ శిబిరం కొత్త ఆశలు రేకెత్తించింది. తమ కుమారులకు తగిన వధువు కోసం వెతికి అలిసిపోయిన తల్లిదండ్రులు ఎంతో మంది కన్నీళ్లతో ఈ శిబిరంలో పాల్గొన్నారు. ప్రజలు ఉచితంగా తమకు తాము సంబంధాలు ఎంచుకునేందుకు ఒక వేదికను ఏర్పాటు చేయడమే ఈ సేవా కార్యక్రమ ఉద్దేశమని ఆలయ నిర్వాహకులు తెలిపారు.

వచ్చిన దరఖాస్తులను వేరుచేసి క్రమబద్ధీకరించే పనులు 10 నుంచి 20 రోజుల వరకు పడుతుందని, వచ్చే నెల ఒకటవ తేదీ నుంచి అర్హత ఉన్న సంబంధాల వివరాలు దరఖాస్తుదారులకు పంపుతామని తెలిపారు. అంతేకాకుండా, నవంబర్ 22 తర్వాత ప్రతి ఆదివారం ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు ఈ సేవ కొనసాగుతుందని ప్రకటించిన ఆలయ నిర్వాహకులు, ఇతర ఆధ్యాత్మిక సంస్థలు కూడా ఇలాంటి సామాజిక సేవల్లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *