బీహార్ రాష్ట్రం శరణ్ (Saran) జిల్లాలోని చెరుగహా గ్రామంలో 37 ఏళ్ల పూజారి దారుణంగా తుపాకీతో కాల్చి చంపబడిన ఘటన తీవ్ర కలకలం రేపింది.
రవి ప్రకాష్ అనే ఈ పూజారి శివుడికి సంబంధించిన ఆధ్యాత్మిక ప్రవచనాలు చెబుతుండేవాడు. అలాగే ధర్మసతి మార్కెట్ ప్రాంతంలో జరిగే హారతి కార్యక్రమాల్లోనూ క్రమం తప్పకుండా పాల్గొనేవాడని తెలుస్తోంది. ఈ క్రమంలో, శుక్రవారం ఉదయం అతను దారుణ హత్యకు గురై విగతజీవిగా పడి ఉండటం గ్రామస్తులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
ఉదయం పూట కొందరు మహిళలు పనుల నిమిత్తం ఇంటి నుంచి బయటకు వెళ్తుండగా.. రోడ్డు పక్కన నిర్మాణ పనుల కోసం పేర్చి ఉంచిన ఇటుకల కుప్ప దగ్గర ఓ వ్యక్తి మృతదేహం పడి ఉండటాన్ని గమనించారు. దగ్గరికి వెళ్లి చూడగా అది పూజారి రవి ప్రకాష్ మృతదేహంగా గుర్తించారు. దీంతో ఆ మహిళలు భయంతో కేకలు వేయడంతో స్థానికులు భారీగా అక్కడికి చేరుకున్నారు. అనంతరం వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకుని హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక విచారణ ప్రకారం.. రవి ప్రకాష్ తలపై తుపాకీతో కాల్చిన గాయం ఉంది. దీంతో అతడిని తుపాకీతో కాల్చి దారుణంగా చంపినట్లు నిర్ధారించారు. ఘటనా స్థలాన్ని డీఎస్పీ సంజయ్ కుమార్ సుధాన్షు, పోలీస్ ఇన్స్పెక్టర్ ఇంద్రజిత్ మహతో, స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) ఉజ్వల్ కుమార్ స్వయంగా పరిశీలించారు.
అంతేకాకుండా, క్లూస్, ఆధారాలు సేకరించేందుకు ఫోరెన్సిక్ నిపుణుల బృందానికి కూడా సమాచారం అందించారు. పూజారిని ఎందుకు హత్య చేశారు?, అతన్ని చంపింది ఎవరు?, ఈ హత్య వెనుక ఉన్న అసలు కారణాలు ఏమిటి? అనే కోణంలో పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఈ హత్యకు గల కారణాలు కానీ, నిందితుల గురించిన వివరాలు కానీ తెలియరాలేదు. ఓ పూజారి ఇలా దారుణ హత్యకు గురైన ఘటన ఆ గ్రామంలో తీవ్ర భయాందోళనలను సృష్టించింది.
