కేరళ రాష్ట్రం మలప్పురం జిల్లా కొట్టంబర ప్రాంతంలో, టీ తయారు చేసి ఇవ్వడానికి నిరాకరించిందనే కోపంతో కోడలిని ఆమె అత్తే కొడవలితో నరికి చంపిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
ఘటన నేపథ్యం: కొట్టంబర గ్రామానికి చెందిన సునీల్ బాబు భార్య రాజిల (28). ఈ దంపతులకు ఒక చిన్న బిడ్డ ఉంది. సునీల్ బాబు తల్లి శాంత (70) కూడా వీరితోనే కలిసి నివసిస్తోంది. అత్త శాంతకు, కోడలు రాజిలకు మధ్య గత కొంతకాలంగా కుటుంబ సమస్యల కారణంగా అప్పుడప్పుడు గొడవలు జరుగుతుండేవి.
ఏం జరిగింది? ఈ రోజు ఉదయం 6:30 గంటలకు సునీల్ బాబు ఎప్పటిలాగే పని కోసం ఇంటి నుండి బయటకు వెళ్లాడు. ఆ సమయంలో ఇంట్లో ఉన్న శాంత.. తనకు టీ పెట్టమని కోడలు రాజిలను అడిగింది. అయితే రాజిల టీ పెట్టడానికి నిరాకరించినట్లు తెలుస్తోంది. దీనితో ఇద్దరి మధ్య మాట మాట పెరిగి తీవ్ర వాగ్వాదం జరిగింది.
ఘోర హత్య: వాగ్వాదం ముదరడంతో ఆగ్రహానికి లోనైన శాంత.. ఇంట్లోని కొడవలిని తీసుకుని కోడలిపై విచక్షణారహితంగా దాడి చేసింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన రాజిల రక్తపు మడుగులో కుప్పకూలిపోయింది. తన కళ్ల ముందే తల్లిపై దాడి జరుగుతుండటం చూసిన చిన్న బిడ్డ భయంతో కేకలు వేసింది. ఆ కేకలు విన్న పొరుగువారు వెంటనే అక్కడికి చేరుకుని, రాజిలను ఆసుపత్రికి తరలించారు. కానీ చికిత్స పొందుతూ ఆమె మరణించింది.
సమాచారం అందుకున్న పోలీసులు రాజిల మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపారు. కోడలిని హత్య చేసిన అత్త శాంతను పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు.
