వ్యాయామం చేయడానికి సరైన సమయం ఉదయమా లేక సాయంత్రమా అనే సందేహం చాలామందిలో ఉంటుంది. దీనికి సమాధానం కనుగొనేందుకు 14,000 మందికి పైగా వ్యక్తుల డేటాను విశ్లేషించి నిర్వహించిన తాజా అధ్యయనం పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది.
పరిశోధకుల ప్రకారం, అస్సలు వ్యాయామం చేయకుండా ఉండటం కంటే ఏ సమయంలో చేసినా శరీరానికి మంచిదే. అయినప్పటికీ, వ్యాయామం చేసే సమయానికి, దాని ద్వారా లభించే అదనపు ప్రయోజనాలకు ప్రత్యక్ష సంబంధం ఉందని ఈ అధ్యయనం స్పష్టం చేసింది.
ముఖ్యంగా, ఉదయం 7 గంటల నుంచి 8 గంటల మధ్య వ్యాయామం చేసేవారిలో గుండె జబ్బులు, అధిక రక్తపోటు (బీపీ), ఊబకాయం వంటి సమస్యలు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. సాయంత్రం వేళల్లో వ్యాయామం చేసేవారితో పోలిస్తే, ఉదయం పూట వ్యాయామం చేసేవారికి గుండెపోటు వచ్చే ప్రమాదం 31 శాతం, టైప్-2 మధుమేహం (డయాబెటిస్) వచ్చే ప్రమాదం 30 శాతం తగ్గుతున్నట్లు తేలింది.
అంతేకాకుండా, అల్పాహారానికి (బ్రేక్‌ఫాస్ట్) ముందే రన్నింగ్ వంటి వర్కౌట్లు చేయడం వల్ల శరీరంలో పేరుకుపోయిన అనవసర కొవ్వులు భారీ స్థాయిలో కరుగుతాయి. వ్యాయామం పూర్తయిన తర్వాత కూడా కొన్ని గంటల పాటు ఈ కొవ్వు కరిగే ప్రక్రియ శరీరంలో కొనసాగుతూనే ఉంటుంది.
అదే సమయంలో, సాయంత్రం వ్యాయామం చేయడం వల్ల కొవ్వుల కంటే కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఖర్చవుతాయి. కాబట్టి ఏ సమయంలో వ్యాయామం చేసినా ఆరోగ్యం మెరుగుపడినప్పటికీ.. వేగంగా బరువు తగ్గడానికి, గుండెను పదిలంగా కాపాడుకోవడానికి ఉదయం చేసే వ్యాయామమే అత్యుత్తమ ఫలితాలను ఇస్తుంది.

Leave a Reply