ఉద్యోగం కోల్పోయినా ఇంత ఆనందమా.? 15 నెలల జీతాన్ని అందజేసిన ప్రముఖ సంస్థ. లేఆఫ్ (Layoff) మెయిల్ చూడగానే గంతేసిన ఇంజనీర్.! రోజూ రాజీనామా చేయాలనుకున్న వ్యక్తికి కొట్టిన జాక్‌పాట్. ఇంత డబ్బు రావడానికి కారణం ఏంటో తెలుసా.?

సాధారణంగా ఎవరికైనా ఉద్యోగం పోతే అది ఎంతో ఆందోళన కలిగిస్తుంది. కానీ, ప్రముఖ టెక్నాలజీ సంస్థ క్వాల్‌కామ్ (Qualcomm)లో పనిచేసిన ఓ సీనియర్ ఇంజనీర్‌కు మాత్రం లేఆఫ్ ప్రకటన ఎనలేని సంతోషాన్నిచ్చింది.

ఆ సంస్థలో ఐదేళ్లుగా పనిచేస్తున్న అతనికి, ఉద్యోగం కోల్పోవడం ద్వారా రాబోయే 15 నెలల జీతానికి సమానమైన మొత్తం లభించనుందని తెలిపాడు.

రెడిట్ (Reddit) వేదికగా తన అనుభవాన్ని పంచుకున్న ఆ ఇంజనీర్, ఆరు నెలల క్రితం వేరే నగరానికి మారడం వల్ల, సంస్థలోనే వేరే విభాగానికి బదిలీ అయినట్లు చెప్పాడు. కానీ, కొత్త బృందంలో (టీమ్) పని వాతావరణం తనకు అనుకూలంగా లేదని, ఎక్కువ గంటలు పనిచేయడం, అధిక పనిభారం, సహోద్యోగుల వ్యక్తిగత విమర్శలతో మానసిక ఒత్తిడికి గురైనట్లు తెలిపాడు. తన ప్రతిభను తక్కువ చేసి మాట్లాడటంతో పాటు, కొత్త టీమ్‌లో సరైన మద్దతు కూడా దొరకలేదని పేర్కొన్నాడు.

దీంతో, రోజూ ఉద్యోగానికి రాజీనామా చేద్దామా అని ఆలోచించేవాడినని అతను తెలిపాడు. ఈ పరిస్థితుల్లో సంస్థలో లేఆఫ్స్ (ఉద్యోగుల తగ్గింపు) ప్రక్రియ మొదలవడంతో, ఆ జాబితాలో తన పేరును కూడా చేర్చాలని మేనేజర్లను కోరాడట. కొద్ది రోజుల తర్వాత అతనికి కూడా ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు మెయిల్ వచ్చింది. కానీ, దాన్ని చూసి అతను బాధపడలేదు; పైగా, తనకు నచ్చని పని వాతావరణం నుంచి బయటపడే అవకాశంగా దీన్ని భావించి సంతోషించినట్లు చెప్పాడు.

లేఆఫ్‌తో పాటు లభించే పరిహార ప్యాకేజీ (Severance package) వివరాలు తెలుసుకున్నప్పుడు అతని ఆనందం మరింత రెట్టింపయింది. మూడు నెలల సాధారణ లేఆఫ్ పరిహారం, నిర్ణీత గడువులోగా పత్రాలను పూర్తి చేస్తే అదనంగా ఒక నెల జీతం, సంస్థలో పనిచేసిన సంవత్సరాల ఆధారంగా ఐదు నెలల జీతం, రీలోకేషన్ అలవెన్స్‌గా మరో రెండు నెలల మొత్తం లభించనున్నాయని తెలిపాడు. వీటికి తోడు వినియోగించుకోని సెలవుల (పెయిడ్ లీవ్స్) డబ్బులు, జనవరి నెలాఖరు వరకు వచ్చే సాధారణ జీతం.. ఇవన్నీ కలిపి మొత్తంగా 15 నెలల జీతానికి సమానమైన ప్యాకేజీ అందుకోనున్నట్లు లెక్కగట్టాడు. ప్రస్తుతం కుటుంబంతో సమయం గడపాలని, కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాలని, ఆ తర్వాతే వేరే సంస్థలో ఉద్యోగం వెతుక్కోవాలని యోచిస్తున్నట్లు అతను వివరించాడు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *